బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ బస్తీల్లో దీపావళి రోజున అర్థరాత్రి దాటిన తర్వాత కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. అందరూ నిద్రపోయిన తర్వాత ఐదుగురు యువకులు వినాయక్నగర్తో పాటు పలు బస్తీల్లో తిరుగుతూ మూసిన కిరాణాషాపుల్లో షట్టర్లకింద పటాకులు పెట్టి పేల్చడం, అరుగుల మీద నిద్రపోతున్న వారిపక్కన పటాకులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు.
రోడ్డుపక్కన ఉండే ఇండ్లలో కిటికీల్లోంచి పటాకాలు వేస్తూ పరుగులు పెట్టడంతో పాటు అరుపులు కేకలతో వీరంగం సృష్టించారు. వీరి ఆగడాలు మొత్తం బస్తీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా సంఘటనలో పాల్గొన్న నలుగురు యువకులను గుర్తించే పనిలో పడ్డారు. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్ వినాయక్‌నగర్, జ్ఞానీజైల్సింగ్నగర్ తదితర బస్తీల్లో రోజూ ఆకతాయిలు రాత్రిపూట ఆరుగులమీద కూర్చుని మద్యం సేవించడం, దారినపోయే వారిని దూషించడం, తాగిన మద్యం బాటిళ్లను రోడ్లపై విసిరివేయడం చేస్తుండంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తక్షణమే బంజారాహిల్స్ పోలీసులు స్పందించి సంఘటనకు కారణయిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.