మెడికల్ డివైజ్ పార్కు తెలంగాణకే తలమానికంగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తొలివిడుత రూ.1424 కోట్లతో 50 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని ఎండీపీలో ఏడు పరిశ్రమలను మంత్రి కేటీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 7వేల మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. మెడికల్ డివైజ్ పార్కులో జీవ ఔషధ రంగానికి సంబంధించి పరిశోధనలతో పాటు నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీల ప్రారంభోత్సవాలు ఉత్సాహభరితంగా జరిగిన అనంతరం మంత్రి చాలా చోట్లకు నడుస్తూనే వెళ్లారు. నాయకులతో ముచ్చటించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు.
పటాన్చెరు, డిసెంబర్ 15 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కు తెలంగాణకు తలమానికంగా మారనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కులో ఏడు పరిశ్రమలు మంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, శాంతాబయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహ్మారెడ్డి, లైప్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు జీవ ఔషధ రంగంలో తెలంగాణను హబ్‌గా మార్చనున్నట్లు చెప్పారు. ఒకప్పుడు రాళ్లు రప్పలతో వ్యవసాయానికి పనికిరాని పడావు భూములను టీఎస్ఐఐసీకి కేటాయించి మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2017లో మెడికల్ డివైజ్ పార్కుకు శంకుస్థాపన చేశామన్నారు. నాలుగేండ్లలోనే అద్భుతమైన పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మెడికల్ డివైజ్ పార్కుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో వైద్యం ప్రాధాన్యత అందరూ గుర్తించినట్లు చెప్పారు. ఔషధాలను, మెడికల్ పరికరాలను 78శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. చివరకు మాస్కులు, చేతి గ్లౌస్లు సైతం దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. జీవ ఔషధ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మెడికల్ డివైజ్ పార్కులో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సైంటిస్టులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో మెడికల్ డివైజ్ పార్కులో కొత్త సంస్థలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అన్నిరకాల ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ డివైజ్ పార్కులో ప్రస్తుతం రూ.1424 కోట్ల పెట్టుబడులతో 50 పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నట్లు చెప్పారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 7వేల మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏడు పరిశ్రమలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మరో ఏడు పరిశ్రమలను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీ యూనిట్ సహాజనంద సంస్థ వారిది త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెడికల్ డివైజ్ పార్కులో జీవ ఔషధ రంగానికి సంబంధించి పరిశోధనలతో పాటు నూతన ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమలను రింగ్‌రోడ్డు బయటకు తరలిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటుతో స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. శాంతాబయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థలో సైంటిస్టుగా పనిచేసిన శిశిర్ మెడికల్ డివైజ్ పార్కులో సొంతంగా లైఫ్ సైన్సెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు.ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, పారిశ్రామికవేత్తల సమక్షంలో ఏడు పరిశ్రమల ప్రారంభోత్సవాలు సందడిగా సాగాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్ నుంచి సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.
కలియతిరుగుతూ…కలివిడిగా మాట్లాడుతూ..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మధ్యాహ్నం 3గంటలకు సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కుకు వచ్చిన మంత్రి కేటీఆర్, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిని పలకరించారు. ఆ తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రమణకుమార్, టీఎస్ఐఐసీ అధికారులతో కరచాలనం చేశారు. మెడికల్ డివైజ్ పార్కులోని ఏడు కంపెనీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, చాలాచోట్లకు మంత్రి నడుస్తూనే వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో ముచ్చటించారు. తనను కలిసేందుకు వచ్చిన సుల్తాన్పూర్, దాయర సర్పంచ్‌లతో మంత్రి కేటీఆర్ మాట్లాడి వారి చెప్పిన విషయాలను ఆసక్తిగా ఆలకించారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఆయా కంపెనీల సిబ్బందితో కలివిడిగా మాట్లాడి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు పరిశ్రమల సిబ్బంది ఆసక్తి చూపారు. కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ ఈర్ల దేవానంద్, సుల్తాన్పూర్ సర్పంచ్ నాగరాజు, దాయర సర్పంచ్ భాస్కర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, టీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.