కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు అధికారుల కసరత్తు
సర్కారుపై నెలకు సుమారు రూ.2.5కోట్ల భారం
ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8కోట్లతో త్వరలో టెండరింగ్
సికింద్రాబాద్, జనవరి 9: కంటోన్మెంట్లో రాష్ట్ర సర్కారు ఉచిత తాగునీటి పథకం అమలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. జీహెచ్ఎంసీలో మాదిరిగానే పూర్తిస్థాయిలో త్వరలోనే ఉచితంగా తాగునీటిని అందించేందుకు ఇప్పటికే పలు దఫాలుగా జలమండలి అధికారులు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కంటోన్మెంట్‌కు నీటి సరఫరాపై డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను సిద్ధం చేశారు. దీన్ని త్వరలోనే కంటోన్మెంట్ బోర్డు అధికారులకు పంపించనున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి రిజర్వాయర్లు కాకుండా మరిన్ని నిర్మించేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతోపాటు నూతన పైపులైన్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే విధంగా సర్కారు దృఢ నిశ్చయంతో ఉంది. కంటోన్మెంట్లో పేద, మధ్య తరగతి ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని బస్తీల్లోనే కాకుండా అపార్ట్మెంట్ వాసులకూ వర్తింపజేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈమేరకు కంటోన్మెంట్లో పూర్తి స్థాయిలో ఉచిత నీటి సరఫరా చేయాలని జలమండలి ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కంటోన్మెంట్‌లోని ప్రజలకు ఈ పథకం లబ్ధి చేకూరే ఈ ప్రక్రియలో విధి విధానాల రూపకల్పనపై జలమండలి ఎండీ దానకిశోర్ పలుమార్లు ఉన్నతాధికారులతో సమావేశమై ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించిన తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో సమగ్ర నివేదికను మంత్రి కేటీఆర్‌కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీటి సరఫరా అందనుంది.
మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే, జక్కుల వినతి
జీహెచ్ఎంసీలో మాదిరిగానే ఉచిత తాగునీటి పథకం కంటోన్మెంట్లో వర్తింపజేయాలని కోరుతూ పలుమార్లు పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే సాయన్నతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి విన్నవించారు. దీంతో కదలిన జలమండలి అధికారులు కంటోన్మెంట్‌కు ఉచిత తాగునీటిని అందించే ప్రక్రియపై నివేదికలు సిద్ధం చేశారు. ప్రధానంగా మొదటగా డీపీఆర్‌ను సిద్ధం చేసిన జలమండలి అధికారులు మంత్రి కేటీఆర్‌కు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు.
నెలకు రూ.2.5కోట్ల భారం
కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలు చేస్తే రాష్ట్ర సర్కారుపై సుమారు నెలకు రూ.2.5కోట్ల భారం పడనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నూతన పంప్‌హౌజ్‌ల నిర్మాణం కోసం మరో రూ.8కోట్ల మేర ఖర్చుతో నిర్మించే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు పలు స్థలాలను రాష్ట్ర సర్కారుకు అప్పగించే కీలక ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. ఇందులో భాగంగా కంటోన్మెంట్ బోర్డు సుముఖంగా ఉంటే త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లను పిలిచే అవకాశం ఉంది. పూర్తిగా ఉచిత నీటి సరఫరా చేస్తే బాధ్యత మొత్తం జలమండలి తీసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు, మరమ్మతులకు సర్కారుపై నెలకు రెండున్నర కోట్లకు పైగా భారం పడనున్నది.
త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా
కషాయం నేతలకు ఇప్పటికైనా జ్ఞానం సిద్ధించాలని కోరుకుంటున్నా.గతంలో జలమండలితో కంటోన్మెం ట్ బోర్డు చేసుకున్న ఒప్పం దం కారణంగానే ఈ ప్రాం తంలో ఉచిత తాగునీటి సరఫరాకు అడ్డుంకులు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది డ్రా మాకృష్ణలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కంటోన్మెంట్ ప్రగతిపథంలో నడిపించేందుకు కంకణం కట్టుకున్న మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సాయన్న నిరంతరం ప్రజాశ్రేయస్సుకు కట్టుబడి ఉంటున్నారు. ఇటీవలే జలమండలి అధికారులు పలు దఫాలుగా కసరత్తులు చేసి కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి సరఫరాపై డీపీఆర్‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర సర్కారుకు భారం అవుతున్నా ప్రజలకు మేలు చేయాలనే సదుద్ధేశంతో మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. దీంతో త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా కంటోన్మెంట్లో అమలు కాబోతుంది.
-జక్కుల మహేశ్వర్‌రెడ్డి,మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు