కవాడిగూడ :దేశంలోనే ఎక్కడలేని విధంగా బతుకమ్మ చీరలను అందజేసి తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచాడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడలోని ఉన్నికోట కమ్యూనిటీ హాల్, భోలక్‌పూర్ డివిజన్లోని తాళ్లబస్తీ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను ఆయన మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక కానుకలు అందజేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నియోజక వర్గంలో ఇప్పటి వరకు 70 వేల బతుకమ్మ చీరలను అందజేశామని ఆయన తెలిపారు.
ఇవే కాకుండా పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు వల్లాల శ్యామ్యాదవ్, వై. శ్రీనివాస్ రావు, ప్రధానకార్యదర్శి చాంద్‌పాషా, నాయకులు బింగి నవీన్‌కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.