బంజారాహిల్స్ : అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ రేసింగ్‌కు పాల్పడుతున్న యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా అర్థరాత్రి దాటిన తర్వాత కొంతమంది యువకులు మితిమీరిన వేగంతో కార్లు నడిపిస్తూ రేసింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
ఈ క్రమంలో హోండా అకార్డ్ కారు (ఏపీ 10ఏసీ 8181) కు ఉన్న సైలెన్సర్‌ను తొలగించి భారీ శబ్ధం కలిగించే సైలెన్సర్‌ను అమర్చుకున్న ఓ యువకుడు అదుపుతప్పిన వేగంతో దూసుకువెళ్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విజయ్‌నగర్ కాలనీకి చెందిన కషిఫ్ అహ్మద్ (21) అని తేలింది. కొంతమంది స్నేహితులు ఈ ప్రాంతంలో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారని తెలియడంతో అతను కూడా ఇక్కడకు వచ్చాడని విచారణలో తేలింది.
దాంతో నిందితుడు కషిఫ్ అహ్మద్‌పై ఐపీసీ 290,335తో పాటు 177 ఆఫ్ ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.