బంజారాహిల్స్ : గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న యువతి (24) కి గతంలో గుంటూరు జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన కార్తీక్ అలియాస్ అబ్రహం కొండవీటి అనే వ్యక్తితో స్నేహం ఉంది. కాగా అతడి ప్రవర్తనతో విసిగిపోయిన యువతి ఇటీవల అతడికి దూరంగా ఉంటోంది.
దీన్ని జీర్ణించుకోలేని కార్తీక్ ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడు. దాంతో సొంతూర్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా మరోసారి ఇలాంటి పనులు చేయనంటూ కార్తీక్ రాసిచ్చాడు. అయితే తిరగి ఇదే విధంగా వేధించడంతో పాటు ఆమె స్నేహితులకు అసభ్యఫోటోలు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు కార్తీక్ అలియాస్ అబ్రహం కొండవీటిపై ఐపీసీ 354(డి) , 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.