గాజులరామారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ సంబరాలు ఊరువాడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండగలో భాగంగా మొదటి రోజైన బుధవారం కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారంలోని రాంకీ వన్ మార్వెల్స్ కాలనీలో వైభవంగా నిర్వహించారు.
రకరకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను చిన్నారులు, మహిళలు పట్టు వస్త్రాలు ధరించి ’బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో’… ‘ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.
అనంతరం మహిళలు, ముత్తైదువులు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకొన్నారు. కాలనీ అధ్యక్షులు శివరామిరెడ్డి, ప్రధానకార్యదర్శి కరణం శ్రీనివాస్, స్వాతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.