ఖైరతాబాద్ : రాజ్‌భవన్ ముందు ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్‌కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జిల్లా మోతె మండలం, లాల్‌తండాకు చెందిన బానోతు నాగరాజు (38) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.
ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం నాగరాజు అక్కడికి చేరుకొని జై తెలంగాణ, జై కేసీఆర్, జై జగదీశ్వర్ రెడ్డి నినాదాలు చేస్తూ…. వారు నా దేవుళ్లంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచాను. రైతుల సంక్షేమానికి ఎవరూ కూడా పాటుపడనంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారు. రైతు బంధు పథకంతో కష్టాలు తీర్చారు. రైతు భీమాతో భరోసా కల్పించారు. రైతులను ఎప్పటికీ ఆదుకునేది ముఖ్యమంత్రి కేసీఆరే.
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఆ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేసిన అసత్యపు ఆరోపణల వల్ల ప్రజల కోసం నిరంతరం పాటుపడే ముఖ్యమంత్రి ధర్నాకు రావాల్సి వచ్చింది. అది చూడలేక పోయా. బీజేపీ నాయకులు బండారం బయటపెట్టేందుకే ఆత్మహత్యకు యత్నించా. అని ఆవేదన వ్యక్తం చేశాడు.