చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద నిందితుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున దేశంలో ప్రధానితో సహా పాలకులు అంతా వేడుకలు జరపుకొంటున్న తరుణంలో కస్తూర్బా నగర్లో 20 ఏండ్ల మహిళను ముగ్గురు యువకులు ఇంట్లోంచి ఎత్తుకుపోయి అత్యాచారం చేసి, జట్టు కత్తిరించి, మొహానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించడం సిగ్గుచేటన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, కె.ఎన్.ఆశాలత, లక్ష్మమ్మ, వినోద, నాగలక్ష్మి, స్వర్ణలత, పద్మ, షబానా, ప్రేమ, భవానీ తదితరులు పాల్గొన్నారు.