యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. కొండపైన పూర్తిగా వసతి సౌకర్యం అందుబాటులోకి రాకపోవడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నిజాభిషేకంలో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నేటి నుంచి కొత్త వేళల
ప్రకారం పూజలు చేయనున్నారు. ఆలయ పునఃప్రారంభం తర్వాత వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. స్వయంభువులను దర్శించుకొని తరిస్తున్నారు.
యాదాద్రి, మార్చి 31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. స్వయంభువులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, పక్కనే లక్ష్మీపుష్కరిణి చెంత పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. క్యూ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఆన్లైన్ టికెట్లను కొనుగోలు చేసి దర్శనానికి బయల్దేరారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ప్రసాద విక్రయశాల వద్ద స్వామివారి లడ్డూలు, పులిహోర కొనుగోలు చేశారు. మరోవైపు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరు కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి అనుబంధ బాలశివాలయంలో పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపించే శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.13,26,958 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కళ్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్దకు, తిరిగి అక్కడి నుంచి కొండపైకి ఉచితంగా చేరవేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు కావాల్సిన వ్యయం దేవస్థానమే భరిస్తుందన్నారు. కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉదయం 4 నుంచి సాయంత్రం 10.30 గంటల వరకు యాదాద్రి దర్శిని పేరుతో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి తెలిపారు.
స్వామివారి గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ సాగుతున్నది. దాతలు, భక్తుల ద్వారా మార్చి 30 వరకు బ్యాంకు ఖాతాలో రూ.18,71,11,346 నగదు జమైనట్లు అధికారులు వెల్లడించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు కొండపైన వసతి సౌకర్యం లేకపోవడంతోపాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నిజాభిషేకంలో పాల్గొనేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్వామివారి నిత్యకైంకర్యాల వేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. భక్తులతో జరిపించే స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం,శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమం, మొక్కు జోడు సేవలను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రధానాలయ లోపలి ప్రాకారంలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు.
ఉదయం 4.00 గంటలకు ఆలయం తెరుచుట
4.30 గంటల వరకు స్వామివారికి సుప్రభాతం
5.00 గంటల వరకు బిందెతీర్థం, ఆరాధన
5.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం
(ఉదయం ఆరగింపు)
6..00 గంటల వరకు శ్రీస్వామివారి పుష్పాలంకరణ సేవ
7.30 గంటల వరకు సర్వ దర్శనాలు
8.30 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం
9.00 గంటల వరకు సహస్రనామార్చన
10.00 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
11.45 గంటలవరకు సర్వదర్శనాలు
మధ్యాహ్నం12.30 గంటలవరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం(ఆరగింపు)
3.00 గంటల వరకు సర్వదర్శనాలు
సాయంత్రం 3.00 నుంచి 4.00 గంటల వరకు ఆలయం మూసివేత
(శని, ఆదివారాలు, విశేష దినాలు మినహా)
సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు బ్రేక్ దర్శనం
రాత్రి 7.00 గంటల వరకు సర్వదర్శనాలు
7.45 గంటల వరకు తిరువారాధన
8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన,
అమ్మవారికి కుంకుమార్చన
9.00 గంటల వరకు సర్వదర్శనాలు
9.30 గంటల వరకు రాత్రి నివేదన(ఆరగింపు)
9.45 గంటల వరకు
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 36,050
వీఐపీ దర్శనం 8,850
సుప్రభాతం 4,800
క్యారీబ్యాగుల విక్రయం 26,150
వ్రత పూజలు 46,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 26,000
ప్రసాద విక్రయం 8,21,780
వాహనపూజలు 4,900
టోల్గేట్ 980
అన్నదాన విరాళం 7,428
సువర్ణ పుష్పార్చన 1,42,000
యాదరుషి నిలయం 52,400
పాతగుట్ట నుంచి 25,700
లీసెస్, లీగల్ 47,200
ఇతర విభాగాలు 61,320