సర్కారు స్కూళ్ల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ప్రతిష్టాత్మక మన ఊరు-మన బడి కార్యక్రమానికి జిల్లాలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా మూడేండ్లలో మూడు విడుతల్లో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనుండగా జిల్లాలో తొలి విడుతలో 251 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆ మేరకు 163 పాఠశాలల్లో 612 సమస్యలను గుర్తించి రూ.30.73 కోట్లతో వసతుల కల్పనకు చర్యలు చేపట్టనున్నారు. 44 పాఠశాలల్లో ఉపాధి హామీ నిధులు రూ.4.14కోట్లతో ప్రహరీ, టాయిలెట్స్, వంట గదులను నిర్మించనున్నారు. తొలుత రూ.30 లక్షల్లోపు పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం జూన్ నాటికి తొలి విడుత పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. మొదట రూ.30లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంచనాలు రూపొందించారు. సాంకేతిక అనుమతులతోపాటు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ఎంఈఓ అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులను మొదలుపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నాటికి కొన్ని వసతులనైనా అందుబాటులోకి తేవాలని సంకల్పించిన ప్రభుత్వం రూ.30లక్షల లోపు పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చేపట్టేందుకు నిర్ణయించింది. పాఠశాలల్లో తాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్, ఇతర చిన్న, పెద్ద మరమ్మతు పనులకు సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. త్వరలో పనులు చేపట్టనున్నారు.
టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణాలను ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టనుండగా.. వీటిని కూడా టెండర్లు లేకుండానే చేపట్టనున్నారు. బల్లాలు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్, స్మార్ట్‌క్లాస్ రూం పరికరాలు, పేయింట్స్, గ్రీన్ చాక్‌పీస్ బోర్డులు, హెచ్ఎం, స్టాఫ్‌రూం ఫర్నిచర్, లైబ్రరీ, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌ల ఫర్నిచర్‌ను టెండర్ల ద్వారా కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారు.
జిల్లాలో మొత్తం 712 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా..తొలి విడుతలో 251 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటికే 163 పాఠశాలల్లో 612 సమస్యలను గుర్తించిన అధికారులు వాటిని పరిష్కరించేందుకు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.30,73,89,634 నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ఎంఈఓ అగ్రిమెంట్ చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. అనంతరం పాఠశాలల్లో తాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్లు, ఇతర మరమ్మతు పనులను చేపట్టనున్నారు. ఇటీవలే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి భువనగిరి మండలంలోని తుక్కాపూర్ పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ పనులకు శంకుస్థాపన చేశారు.
అన్ని పాఠశాలల్లో జూన్ నాటికి పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించగా.. అధికారులు ఆమేరకు కసరత్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు 44 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ప్రహరీ నిర్మించేందుకు ఎస్టిమేషన్ను సిద్ధం చేశారు. ఈ పనులను ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టనున్నారు. 24 కిచెన్ షెడ్ల నిర్మాణాలకు రూ.2.50లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలను వెచ్చిస్తున్నారు. ఒక్కో బ్లాక్‌కు రూ.3లక్షలు ఖర్చు అవుతుండగా 77 టాయిలెట్స్ బ్లాక్ నిర్మాణాలను రూ.2.31 కోట్లతో చేపట్టనున్నారు. 5వేల మీటర్ల మేర నిర్మించే ప్రహరీ కోసం రూ.1.23కోట్లను ఖర్చు చేస్తున్నారు. పరిపాలనా అనుమతులు కూడా రావడంతో వెంటనే పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పనులు పూర్తయితే పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి.
తొలి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో రూ.30లక్షల లోపు పనులను టెండర్లు లేకుండానే చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నిధులు కూడా మంజూరు చేసింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇది పూర్తయిన వెంటనే పనులు మొదలవుతాయి. రూ.30కోట్లతో చేపట్టే పనులను జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం.
– కానుగుల నర్సింహ, డీఈఓ