దండేపల్లి, ఏప్రిల్5: సమాజంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, చిన్నతనంలో ఎదురైన అనుభవాలు.. విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. వినూత్న ఆవిష్కరణలకు బీజం వేస్తున్నాయి. తమలోని మేధకు సానబెట్టి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం, యునిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువాహ్ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో దండేపల్లి మండలం వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, గైడ్ టీచర్ వేణుగోపాల్ సహాయంతో రూపొందించిన మైజ్ ఆన్ హీట్ డివైజ్( మొక్క జొన్న కాల్చే సులభ పరికరం) నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల ప్రదర్శనలు తిలకించి, ప్రాజెక్టు వివరాలు తెలుసుకొని ప్రశంసించారు.మంత్రులు, విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా రూ.1.50లక్షలు చెక్కు అందజేశారు.భవిష్యత్తులో మైజ్ ఆన్ హీట్ డివైజ్ పరికరాన్ని అందరికీ అందుబాటులో ఉంచేలా మార్కెట్లోకి విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా వై-హబ్ ఇంక్యూబేటర్‌ను ప్రారంభిస్తామన్నారు.
మక్క కంకులు కాల్చేందుకు ప్రస్తుత రోజుల్లో బొగ్గులు దొరకని పరిస్థితి. బొగ్గులు దొరికినా పొగతో చాలా ఇబ్బందులు పడడం గమనిస్తుంటాం. దీంతో సులభంగా కంకులను కాల్చే పద్ధతిని కనిపెట్టారు విద్యార్థులు. నిక్రోమ్ తీగ, స్తూపకార మట్టిపైపు, విద్యుత్‌తో ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. నిక్రోమ్ తీగకు కరంట్‌ను అందించగానే విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. దీంతో కంకులు, ఇతర దుంపలు(కందగడ్డ, ఆలుగడ్డ), చేపల ఫ్రై, చికెన్ ఫ్రై వంటివి 3 నిమిషాల్లో కాల్చవచ్చు. గంటలో 15 మక్క కంకులను కాల్చవచ్చు. బొగ్గుల కోసం చూడకుండా, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని విద్యార్థులు నిరూపించారు.
పాల్గొన్న విద్యార్థులు: వినయ్‌వర్మ, టి.అభిలాష్, లక్ష్మణ్, బి.అభిలాష్.
గైడ్ టీచర్: వి.వేణుగోపాల్.
పాఠశాల: వెల్గనూర్
జడ్పీ ఉన్నత పాఠశాల
పరికరానికి అయిన ఖర్చు: రూ.50.
విద్యార్థుల్లోని మేధా శక్తిని బయటకు తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయి. మారుమూల పల్లెలోని మా పాఠశాల రాష్ట్ర స్థాయిలో ఎంపికవడం, మంత్రు లు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రైజ్‌మనీ అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రయోగాలు చేయాలనే సంకల్పం ఉండి, మెదడుకు పదును పెడితే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి. కేవలం రూ.50 తో డివైజ్‌ను రూపొందించాం. డివైజ్ రూపొందించడానికి రెండు కిలోల సిమెంట్, నిక్రోమ్ తీగను ఉయోగించాం. గంటలో 15 మక్క కంకులను కాల్చవచ్చు. భవిష్యత్తులో మా విద్యార్థులతో కలిసి మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం.
– వీ వేణుగోపాల్, గైడ్ టీచర్
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలకు స్కూల్ ఇన్నోవేషన్ పోటీలు దోహదపడుతాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీలను మా పాఠశాలకు చెందిన విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది. గైడ్ టీచర్, విద్యార్థుల ప్రదర్శనల పట్ల మంత్రులు, ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేయడం, భవిష్యత్తులో మైజ్ ఆన్ హీట్ డివైజ్ పరికరాన్ని అందరికీ అందుబాటులో ఉంచేలా మార్కెట్లోకి విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చింది. -గాయత్రి, హెచ్ఎం(వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాల)