వరంగల్,సెప్టెంబర్ 25: వలస జీవులతో నిండిపో తున్న నగరాల్లో సొంత ఇళ్లు లేని వారు మరణిస్తే అంతి మ సంస్కారాలతోపాటు కర్మకాండలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రత్యేక సదుపాయాలతో మోడల్ మహాప్రస్థానాన్ని నిర్మిస్తున్నది. రెండు ఎకరాల విస్తీర్ణంలో మూడున్నర కోట్ల అంచనాలతో వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో ని 57వ డివిజన్లో వైకుంఠధామం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మహా ప్రస్థానం తరహాలో ఫినెక్స్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్‌తో గ్రేటర్ కార్పొరేషన్లో మోడల్‌గా నిర్మాణం సాగుతోంది. సివిల్ పనులు పూర్తి కాగా, కేవలం గ్రీనరీ, శివుడి విగ్రహం ఏర్పాటు పనులు మాత్రమే మిగిలాయి. మరో పక్షం రోజుల్లో మోడల్ మహా ప్రస్థానం పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు.
పుట్టిన దగ్గరి నుంచి చావు వరకు మనిషి బతుకు సారం తెలపే గీతోపదేశాలు మహా ప్రస్థానంలో ప్రత్యే కంగా పెయింటింగ్ వేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆఖరి మజిలీ కేంద్రం ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. బర్నింగ్ ప్లాట్ ఫాం వద్దకు వెళ్లే మార్గంలోని గోడలపై వేసిన గీతోపదేశాలు అంతి మ సంస్కారానికి వచ్చే వారికి జీవిత పరమార్థం తెలియజేస్తున్నాయి దీంతోపాటు మహా ప్రస్థానంలో అన్ని వసతులు కల్పిస్తున్నారు. నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫాంలు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా డ్రెస్సింగ్ రూంలు, కర్మకాండలు చేసుకునే విధంగా పెద్ద హాలు, రెండు గదులుతో కూడిన భవనం, ఆఫీస్ కార్యాలయం, అస్థికలు భద్రపరిచేందుకు ప్రత్యేక లాకర్లు, ప్రహరీ, పెద్ద గేట్‌తో మోడల్ మహా ప్రస్థానం నిర్మాణ ప నులు తుది దశకు చేరుకున్నాయి. దహన సంస్కారాలను చూసే విధంగా బర్నింగ్ ప్లాట్ ఫాంకు ఎదురుగా ప్రత్యేకంగా లాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే సివిల్ పనులు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానంలో మిగిలిన పనులు మరో పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు. హార్టికల్చర్ విభాగానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మహా ప్రస్థానంలో గ్రీనరీకి పెద్ద పీట వేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రీనరీ, పూల మొక్కలు, ఆక్సిజన్ మొక్కలతో మహా ప్రస్థానాన్ని తీర్చిదిద్దనున్నారు. మరో వారం రోజుల్లో ఆరు ఫీట్ల శివుడి విగ్రహం మహా ప్రస్థానంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగా గ్రేటర్లో మోడల్ మహా ప్రస్థానం రూపుదిద్దుకుంటున్నది.