ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో చేపట్టే నిరసన దీక్షలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆదివారం తరలివెళ్లారు. కొందరు శనివారమే రైళ్లలో బైలెల్లగా, మరికొందరు ఆదివారం ఫ్లైట్ ఎక్కారు. అందరూ రాత్రి వరకు హస్తినకు చేరుకున్నారు. తెలంగాణ రైతులు వానకాలం, యాసంగి సీజన్లలో పండించిన వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కేసీఆర్‌తో కలిసి నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
వరంగల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో చేపట్టే నిరసన దీక్షలో పాల్గొనేందుకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. కొందరు శనివారం రైళ్లలో బయల్దేరగా, మరికొందరు ఆదివారం ఫ్లైట్ ఎక్కారు. వీరంతా రాత్రి వరకు దేశ రాజధానికి చేరుకున్నారు. తెలంగాణ రైతులు పండించిన వానాకాలం, యాసంగి సీజన్ల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమించాలని అధిష్టానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
దీంతో టీఆర్ఎస్ శ్రేణులు రెండో విడుత ఉద్యమ కార్యాచరణలో భాగంగా మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, వాడవాడలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్రలు, చావుడప్పు, కేంద్రం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్, డీసీసీబీ, ఓడీసీఎంఎస్, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, రైతుబంధు సమితిల ప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొని కేంద్రం వైఖరిపై నిరసన తెలిపారు.
సోమవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన దీక్ష జరుగనుంది. మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజాపరిషత్‌లు, డీసీసీబీ, ఓడీసీఎంఎస్, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు నిరసన దీక్షలో పాల్గొననున్నారు. జిల్లాలోని రాయపర్తి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి తదితర మండలాల్లోని టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, రైతుబంధు సమితిల ప్రతినిధులు తదితరులు రిజర్వేషన్ చేసుకుని శనివారం వివిధ రైళ్ల ద్వారా ఢిల్లీ బయల్దేరారు. వీరందరూ ఆదివారం రాత్రి వరకు హస్తినకు చేరుకున్నారు. ఆదివారం జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఫ్లైట్ ఎక్కారు.
వీరిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమారస్వామి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్లు రజినీ, అరుణ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి వేర్వేరు ఫ్లైట్లలో బయల్దేరిన వీరందరూ ఢిల్లీలో దిగారు.
కొందరు జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, నేతలు కూడా ఫ్లైట్ ద్వారా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో కలిసి నిరసన దీక్షలో పాల్గొంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై అనుసరిస్తున్న తీరుపై నిరసన తెలియజేస్తారు. అనంతరం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీ నుంచి తిరిగి జిల్లాకు రానున్నారు.