వరంగల్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ జాతరకు తెరలేపడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత కొలువులే లక్ష్యంగా కష్టపడుతున్నది. లైబ్రరీలనే అడ్డాలుగా చేసుకొని పొద్దున నుంచి సాయంత్రం వరకు కుస్తీ పడుతున్నది. ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలనే అంకితభావంతో చదువుతున్నది. యువత జాబుల కోసం సిద్ధమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను అందించి, లైబ్రరీల్లో ప్రతి పుస్తకాన్ని అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్న ప్రతి ఒక్కరికీ గ్రంథాలయాలు కొండంత అండగా మారాయి. పైగా పోస్టుల సాధనలో నిమగ్నమైనవారి ఆకలి తీర్చేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేసింది. చదువుకునే చోటే భోజనం కూడా ఉండడంతో యువతకు ఎంతో ఊతమిచ్చినట్లుయింది. ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి అన్ని గ్రంథాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.
లైబ్రరీలు విద్యార్థులకు సమాచార కేంద్రాలుగానూ ఉపయోగ పడుతున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం ఉండడంతో లైబ్రరీల్లో అధునాతన ఎడిషన్స్, జర్నల్స్, మ్యాగ్జైన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఉన్నత విద్య కోర్సుల నోటిఫికేషన్లు, ఉద్యోగ ప్రకటనలను ఆయా సంస్థలు ఇప్పుడు వెబ్సైట్లోనే పెడుతున్నాయి. దరఖాస్తుల ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నది. ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీ సౌకర్యాలను విద్యార్థులు, యువత ఉచితంగా పొందుతున్నారు. మైక్రోచిప్, పెన్‌డ్రైవ్‌లలో పాఠ్యాంశాలను డౌన్లోడ్ చేసుకుని మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు. విద్యార్థులకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. పరిశోధన, ప్రాక్టికల్ కోర్సులకు అవసరమైన మెటీరియల్ అంతా ఆన్లైన్లో లభ్యమవుతున్నది. పుస్తకాలు కొనాలంటే ఖర్చు అవుతుంది. నిరుద్యోగుల వద్ద అంత మొత్తం ఉండదు. ఈ క్రమంలో లైబ్రరీలోని డిజిటల్ వ్యవస్థ పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు బాగా ఉపయోపడుతున్నది.
మాది జనగామ జిల్లా. హనుమకొండలో కానిస్టేబుల్ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నా. గతంలో ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నా. ఆరు నెలలుగా లైబ్రరీలో చదువుకుంటున్న. గతంతో పోలిస్తే ఇప్పడు గ్రంథాలయాలు ఎంతో బాగున్నాయి. ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యేవారికి చాలా యూజ్‌ఫుల్‌గా మారాయి. ఇక్కడ ఇంటర్నెట్లో సమాచారం సేకరిస్తున్న. ల్రైబరీలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనం చాలా బాగుంది.
-భూక్యా నరేశ్
డిగ్రీ పూర్తి చేసిన. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం చదువుతున్నా. ఇక్కడ లైబ్రరీలో మొత్తం మెటీరియల్ అందుబాటులో ఉంది. కావాల్సినప్పుడు పుస్తకాలు తీసుకుని చదువుకుంటున్నా.
– ఏ. సునీత, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
పిల్లలకు కావాల్సిన పుస్తకాలు తెప్పిస్తున్నాం. గ్రంథాలయాన్ని ఆధునీకరించాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా ఏర్పాట్లు చేశాం. భవనానికి రంగులు వేయించాం. ప్రహరీ నిర్మించాం. గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఎక్కడాలేని పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. 70 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల నుంచి ప్రధాన పత్రికలను బైండింగ్ చేస్తూ భద్రంగా పెడుతున్నాం.
– కే శశిజాదేవి, లైబ్రరీ కార్యదర్శి
గ్రంథాలయాలన్నింటినీ సీఎం కేసీఆర్ ఆధునీకరిస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని హంగులతో కొత్తగా మారుస్తున్నారు. గతంలో ఉన్న లైబ్రరీలకు ఇప్పుడున్నవాటికి చాలా తేడా ఉంది. లైబ్రరీల్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేయడంతో లైబ్రరీకి వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది.
సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటించినప్పటి నుంచి లైబ్రరీకి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. నాకు రెండుసార్లు ఉద్యోగం మిస్ అయింది. ఈసారి ఎలాగైనా టీచర్ జాబ్ కొడుతా. ఎనిమిది నెలలుగా చదువుతున్నా. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లైబ్రరీలోనే చదువుకుంటున్న. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నయ్
– చంద్రకళ, హనుమకొండ
మైసూర్లో డిగ్రీ పూర్తి చేశా. మొదటిసారిగా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నా. గ్రూప్-1 జాబ్ సాధిస్తా. లైబ్రరీ వద్ద మంచి వాతావరణం ఉన్నది. అన్ని బుక్స్ ఉన్నాయి. ప్రిపరేషన్‌కు టైంటేబుల్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నా. – పుల్లూరి దివ్య
హనుమకొండలోని జిల్లా గ్రంథాలయం, కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీలో ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వీటిలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండడంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. యూనివర్సిటీలోని డిజిటల్ లైబ్రరీలో ఐఐటీ, ఎన్ఐటీ నిపుణుల లెక్చర్లను విద్యార్థులు వింటున్నారు. అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్, ఈ పేపర్స్, సాంకేతిక ప్రగతిపై పట్టు సాధించేందుకు ఇక్కడి వసతులను వినియోగించుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో గ్రంథాలయం కళకళలాడుతున్నది. లైబ్రరీలో అకడమిక్ పుస్తకాలు, డిజిటల్ లైబ్రరీల నిర్వహణతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం ఉండడంతో ఎక్కువ మందికి ఉపయోపగడుతున్నది. హనుమకొండ సెంట్రల్ లైబ్రరీలో 70 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు పుస్తకాలు 17,497, ఇంగ్లిష్ పుస్తకాలు 12,087, హిందీ పుస్తకాలు 4,031, ఉర్దూ పుస్తకాలు 2,941, ఇతర భాషల పుస్తకాలు 19 అందుబాటులో ఉన్నాయి. కేయూ లైబ్రరీలో అన్ని రకాల సబ్జెక్టు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ రీజినల్ లైబ్రరీలో 70 వేల పుస్తకాలున్నాయి. స్మార్ట్ సిటీ కార్యాచరణలో భాగంగా రీజినల్ లైబ్రరీని కొత్తగా మార్చారు. అన్ని పుస్తకాలను డిజిటలైజ్ చేశారు. ఇందులో ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పేద యువతకు ఉపయోగపడేలా ఈ లైబ్రరీని తీర్చిదిద్దారు.
విద్యార్థులకు అవసరమైన అన్ని విభాగాల పుస్తకాలు లైబ్రరీ లో ఉన్నాయి. అకడమిక్, పత్రికలు, మ్యాగజైన్, జర్నల్స్, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటు లో ఉంచాం. గతంలో ఇన్ని పుస్తకాలు లేవు. ఉద్యోగాల ప్రకటన తో లైబ్రరీకి పాఠకుల సంఖ్య పెరిగింది. చదువుకునేందుకు రోజూ చాలా మంది వస్తున్నారు.
– సీహెచ్. మన్సూర్, లైబ్రేరియన్
గ్రంథాలయంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో పెట్టాం. కావాల్సిన సమాచారం కోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. గంటకు రూ.10 ఉంది. మెంబర్షిప్కార్డు ఉన్నవారికి రూ.5 మాత్రమే తీసుకుంటున్నాం.
– గుడికందుల రాజేశ్, ఇంటర్నెట్ ఇన్చార్జి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగుతుండడంతో హనుమకొండ సెంట్రల్ లైబ్రరీకి ఎక్కువ మంది యువత, విద్యార్థులు వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పేదలే ఉంటున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి కోసం ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ చొరవతో లైబ్రరీ ఆవరణలో ప్రత్యేకంగా అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. లైబ్రరీకి వచ్చి చదువుకునేవారికి రూ.5కే భోజనం పెడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లో రోజూ సగటున 600 మందికి భోజనం అందిస్తున్నారు.
హనుమకొండ లైబ్రరీలో ఎన్నో పుస్తకాలున్నాయి. మాది జగిత్యాల జిల్లా. కిట్స్ కాలేజీలో బీటెక్ చేసిన. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న. సంవత్సరం నుంచి లైబ్రరీకి వస్తున్నా. అన్నపూర్ణ క్యాంటీన్ మాలాంటి వారికి బాగా ఉపయోగపడుతున్నది.
-గాదెం రాకేశ్, జగిత్యాల