హనుమకొండ, ఏప్రిల్ 14 : ఔను వాళ్లిప్పుడు కూలీలు కాదు.. ఓనర్లయ్యారు.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ‘దళితబంధు’ద్వారా వాళ్లు యజమానులయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లాలోని పశ్చిమ, వర్ధన్నపేట, హుజూరాబాద్ (కమలాపూర్), పరకాల నియోజకవర్గాల పరిధిలో 43 మందికి గిరిజన సంక్షేమ భవన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి గురువారం యూనిట్లు పంపిణీ చేశారు. వీరికి రూ.4,08,08,751 విలువ చేసే 31 యూనిట్లు అందించారు.
పరకాల నియోజకవర్గంలో ఐదుగురికి రూ. 48,62,486 విలువ చేసే ఐదు యూనిట్లు, పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నలుగురికి రూ.32,82,668 విలువ చేసే నాలుగు యూనిట్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎనిమిది మందికి రూ.77,68,182 విలువ చేసే ఎనిమిది యూనిట్లు, హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో 26 మందికి రూ. 2,48,95,415 విలువగల 14 యూనిట్లు పంపిణీ చేశారు. వీటిలో జేసీబీలు, వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, మొబైల్ రైస్‌మిల్లులు, ఎర్టిగా, బోలెరో గూడ్స్ వాహనాలు వంటివి ఉన్నాయి. వీటిని అందుకున్న లబ్ధిదారులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. దళిత బాంధవుడైన సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు తమ సంతోషాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు.
నిరుపేదలమైన మమ్ములను దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన్రు. చాలా సంతోషంగా ఉంది. పెండ్యాల భాస్కర్, సురేఖ, సోమిడి రమ ముగ్గురం కలిసి ఈ పథకంతో వచ్చిన డబ్బుతో ఎక్స్కవేటర్ కొనుగోలు చేసినం. నేను ఇప్పటివరకు చాలీచాలని వేతనంతో డ్రైవర్‌గా పనిచేసిన. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధుతో కొనుక్కున్న ఎక్స్‌కవేటర్‌తో మా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్.
– పెండ్యాల భాస్కర్, గూనిపర్తి, కమలాపూర్
మేము కూలీనాలి చేసుకొని బతికేటోళ్లం.. మా దయనీయ పరిస్థితిని గుర్తించి దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటం. ముగ్గురం కుటుంబ సభ్యులం కలిసి ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బుతో వరి కోత మిషన్ కొనుక్కున్నం. దీంతో మంచిగ పనిచేసి బాగుపడుతం. మా కుటుంబాలను మంచిగ సాదుకుంటం. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ సారు మేలు మరువం.
– మిడిదొడ్డి మొగిలి, గుండేడు, కమలాపూర్ మండలం
ఇప్పటి వరకు నేను ఒకరి వద్ద ఎక్స్కవేటర్ ఆపరేటర్‌గా పనిచేసేటోన్ని. సీఎం కేసీఆర్ ఇచ్చిన రైతుబంధుతో ఇప్పుడు నేనే ఓనర్‌ను అయిన. పథకం కింద ముగ్గురం కుటుంబసభ్యులం కలిసి ఎక్స్కవేటర్ కొనుక్కున్నం. దీంతో మా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎన్ని జన్మలెత్తినా కేసీఆర్ మేలు మరువం.
– ఈర రఘు, అంబాల, కమలాపూర్ మండలంకేసీఆర్కు రుణపడి ఉంటం
మా కుటుంబంలో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్. ఆయనకు మేము రుణపడి ఉంటం. మా ఆయన ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ మమ్ముల్ని పోషిస్తున్నాడు. దళిత బంధు కింద మేమే ఎర్టిగా కారు కొనుక్కున్నం. ఇపుడు మా ఆయనే ఓనరైండు. ఆర్థికంగా బాగుంటం. మా కుటుంబం బాగుపడుతది. సీఎం కేసీఆర్, కేటీఆర్, అరూరి రమేశ్ సార్లకు కృతజ్ఞతలు.
-బత్తుల సౌజన్య, మునిపల్లి, హసన్‌పర్తి మండలం