ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తెలంగాణలో ఆలయాలకు పూర్వవైభవం వస్తున్నదని, అందుకు యాదాద్రి పునర్నిర్మాణమే ఒక నిదర్శనమని భక్తులు కొనియాడుతున్నారు. నర్సన్న నిండైన దీవెనతో సీఎం వేములవాడ రాజన్న సేవకు కదలడంపై ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పేదల దేవుడు రాయేశుడు అంటే సీఎంకు అమితమైనప్రేమ అని, ఆ భక్తితోనే ముఖ్యమంత్రి హోదాలో మూడు సార్లు వేములవాడకు వచ్చి దర్శనం చేసుకున్నారని గుర్తు చేశారు. రాజన్నను దర్శించుకుంటే పదవీగండం తప్పదనే అపవాదును తొలగించడమే కాకుండా, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. త్వరలోనే వేములవాడను అద్భుత దివ్యధామంగా మలుస్తారని, దీంతోపాటే కొండగట్టు అంజన్న ఆలయాన్ని భవ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ టౌన్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మించిన సీఎం కేసీఆర్.. నర్సన్న నిండైన దీవెనతో రాజన్న సేవకు కదులుతున్నారు. ఇప్పటికే దక్షిణకాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరుడి క్షేత్రంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి హోదాలో మూడుసార్లు వేములవాడకు వచ్చి.. రాజన్నను దర్శించుకున్నవారికల్లా పదవీగండం తప్పదనే అపవాదును ప్రచారంలోకి తెచ్చి, ఇటువైపు కన్నెత్తి చూడడమే మరచిపోయిన పలువురు నేతల కళ్లు తెరిపించారు. 2015 జూన్ 18న, డిసెంబర్ 28న, 2019 డిసెంబర్ 30న స్వామివారలను దర్శించుకొని, క్షేత్రస్థాయిలో తిరిగారు. మొదటి సారి సందర్శించినప్పుడే రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పట్టణాన్ని సమగ్రాభివృద్ధి చేసేవిధంగా వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా ఇప్పటికే కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇటు ముత్యంపేట పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి గతంలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కోట్లాది రూపాయలతో పనులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ రాజన్న ఆలయంతోపాటు కొండగట్టు అంజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రాలు మలచడానికి పూనుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వల్లనే తెలంగాణ ప్రాంతం ఆధ్యాత్మిక స్వర్గధామంగా వెలుగులీనుతున్నదని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
కొండగట్టు అంజన్న ఆలయం త్వరలోనే దివ్య క్షేత్రంగా మారుతుంది. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టడడం, త్వరలోనే పర్యటించే అవకాశాలతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. యాదాద్రి తరహా కొండగట్టునూ తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉంది. మాస్టర్‌ప్లాన్‌ను అమల్లోకి తెస్తే భక్తులకు మెరుగైన వసతి గదులు, కాటేజీలు, మరిన్ని మౌళిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా అంజన్న సన్నిధి నిలిచే రోజు దగ్గరలోనే ఉందని అనుకుంటున్నా.
– టంకశాల వెంకటేశ్, ఈవో, కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం
యాదాద్రి తరహాలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు అంజన్న దేవస్థానాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు మార్గం సుగమమవుతుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. వసతులు పెరుగుతాయి. సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచీ ఆలయాలపై అమితమైన ప్రేమ ఉంది. అర్చకుల సంక్షేమానికి కృషిచేస్తున్నరు. ఆయనకు కృతజ్ఞతలు.
– తిరుక్కోవెల మారుతీస్వామీ, ఆలయ పాలకవర్గ చైర్మన్, కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం.
కొండగట్టు అంజన్న సన్నిధానంలో కొద్దిరోజుల నుంచే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల రామకోటి స్తూపం నిర్మాణం పూర్తయింది. అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో పలువురు దాతలు కొండగట్టు దిగువన రెడ్ మార్బుల్‌తో అంజన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆలయ పరిధిలో ఆగమ వేద పాఠశాలను ఏర్పాటు చేసి తరగతులను సైతం నిర్వహిస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టి, పనులు చేస్తున్నారు.
– ఆచార్య టీ జితేంద్రప్రసాద్, ఆలయ స్థానాచార్యులు, కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం.
యాదాద్రిని సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మించారు. తీరొక్క వసతులు ఉండేలా చూశారు. ఇపుడు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు వస్తున్నారనే కేసీఆర్ ప్రకటన వినగానే చాలా సంతోషం అనిపించింది. రాజన్న ఆలయాభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం చాలా కృషిచేస్తున్నది. కోట్లాది నిధులు ఇస్తున్నది. సీఎం చొరవతో త్వరలోనే దివ్యక్షేత్రంగా మారుతుంది.
– అరుణాద్రి, వేములవాడ వాసి
ఆలయాల ప్రగతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిది. యాదాద్రిని అద్భుతంగా నిర్మించారు. ఇపుడు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అంటున్నరు. చాలా సంతోషం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయాన్ని విస్తరిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. ఇక నుంచి రాజన్నను సంతృప్తిగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. కేసీఆర్‌కు రాజన్న కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా.
– తాటికొండ శేఖర్. వ్యాపారి. వేములవాడ
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తెలంగాణలో ఆలయాలకు పూర్వవైభవం వస్తున్నది. అందుకు యాదాద్రి పునర్నిర్మాణమే ఒక నిదర్శనం. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు శతకోటి వందనాలు. ఏ ప్రభుత్వం చేయని పని టీఆర్ఎస్ సర్కారు హయాంలో జరుగుతుండడం సంతోషంగా ఉంది. మరో రెండు, మూడేళ్లలో క్షేత్రం రూపురేఖలు మారుతున్నాయనంటే నమ్మలేకపోతున్న. అందుకే గుర్తుగా ఆలయం ఫొటోలు తీసుకుంటున్నాం.
– సత్యం. వేములవాడ
వేములవాడ టౌన్, మార్చి 31: ఎములాడ రాజన్న ఆలయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, త్వరలోనే సకల హంగులతో అభివృద్ధి చెందుతుందని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా, ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఉపేంద్రశర్మ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, అర్చక, బ్రాహ్మణ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అర్చక ఉద్యోగులు 5625 మందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఇంకా దూప, దీప నైవేద్య పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఉద్ఘాటించారు. ఆలయాల అభివృద్ధికి యాదాద్రే ఒక ఉదాహరణ అని, సీఎం కేసీఆర్ త్వరలోనే జగద్గురువులు శారదాపీఠాధిపతిని సంప్రదించి రాజన్న ఆలయం పునరుద్ధరణ పనులు ప్రారంభించబోతున్నట్లు వివరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్రీయ పంచాగాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమితి అధ్యక్షుడు రాజాచంద్రశర్మ, ప్రధాన అర్చకులు నమిలకొండ ఉమేశ్‌శర్మ, కేశన్నగారి రాజేశ్, వేదపండితులు సువర్ణ రాధాకృష్ణశర్మ, దుమాల వాసు, జగన్మోహన ఉపాధ్యాయ, ఆంజనేయశర్మ ఉన్నారు.