పెంబి, ఏప్రిల్ 5 : ఆ రైతు వరికి బదులు ఇతర పంటలు వేయాలన్న రాష్ట్ర సర్కారు సూచన మేరకు మల్బరీ, పట్టుపురుగుల పెంపకం చేపడుతూ లాభాలు పొందుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెంబి మండల కేంద్రానికి చెందిన తుర్క మోహన్ రెడ్డికి ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎకరంన్నరలో గతేడాది జూన్ 25న 7500 మల్బరీ మొక్కలు నాటాడు. (15 ఏళ్ల వరకు వీటి నుంచి ఆకులు తెంపుకోవచ్చు). ఒక్కో మొక్క ధర రూ. 5 ఉండగా, ప్రభుత్వం సబ్సిడీపై రూ. 2 చొప్పున అందించింది. మార్చి ఒకటిన రూ. 1650తో 150 పట్టు పురుగుల గుడ్లు తీసుకొచ్చాడు. ప్రత్యేకంగా రూపొందించిన బాక్సుల్లో వాటిని పొదిగేశాడు. ఒక్కో గుడ్డు నుంచి 500 పట్టు పురుగులు ఉత్పత్తి (రెండు రోజుల్లోనే) అయ్యాయి. వీటికి ప్రతి రోజూ మల్బరీ ఆకులు వేస్తున్నాడు. అవి తింటూ పట్టు గూళ్లు పెడుతున్నాయి. మరో రెండు రోజుల్లో పట్టు చేతికి వస్తుంది. క్వింటాల్ వరకు దిగుబడి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో పట్టుకు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ. 75 వేలు పలుకుతుంది. అన్ని ఖర్చులు పోను రూ. 60 వేల వరకు ఆదాయం వస్తుందని మోహన్‌రెడ్డి చెబుతున్నాడు. పట్టుపురుగుల పెంపకంతో ఏడాది పాటు ఆదాయం పొందే వీలుంటుందని ఆయన పేర్కొంటున్నాడు. మరోవైపు 45 రోజుల క్రితం 2 ఎకరాల్లో నువ్వులు, 3 ఎకరాల్లో మక్క వేశాడు.
మిగతా పంటలకంటే మల్బరీ, పట్టు పురుగుల పెంపకం చాలా సులువు. గతంలో సంప్రదాయ పంటలు వేసి నష్టపోయాను. వరి పండించవద్దని, డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించడంతో మల్బరీ, పట్టు పురుగుల పెంపకాన్ని ఎంచుకున్నా. సెరీకల్చర్ అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు. పంట గురించి క్లుప్తంగా వివరించారు. ప్రభుత్వం షెడ్డు నిర్మాణం, మల్బరీ మొక్కలకు సబ్సిడీ కూడా ఇచ్చారు. ఏడాది పాటు ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు.
– తుర్క మోహన్ రెడ్డి, రైతు, పెంబి
ఇతర పంటల కంటే మల్బరీ, పట్టు పురుగుల పెంపకంతో మంచి లాభాలు పొందవచ్చు. ఎర్ర, నల్ల, ఇసుక నేలల్ల్లో మల్బరీ పెంచుకోవచ్చు. పట్టు కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొదటిసారి పంట వేసేట ప్పుడు ప్రభుత్వం రైతులకు షెడ్డు నిర్మాణం, మల్బరీ మొక్కల పెంప కం కోసం రూ. 2.25 లక్షల సబ్సిడీ ఇస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు సంప్రదిస్తే సలహాలు, సూచనలు ఇస్తాం. షెడ్డు నిర్మాణం, మొక్కల పెంపకానికి ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీని అందజేస్తాం.
– డీ రాములు, సెరీకల్చర్ సహాయ సాంకేతిక నిపుణుడు