ఎర్ర బంగారం కాసులు కురిపిస్తున్నది. బంగారం ధరతో పోటీ పడుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో రేటు పలుకుతున్నది. ఈ యేడాది క్వింటాలు ఎండు మిర్చి ధర రూ.55 వేలు పలికింది. వరి వదిలి ఇతర పంటలు వేయాలని సీఎం కేసీఆర్ సూచించగా.. రైతులు ఆ దిశగా పంటలు వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా.. వాతావరణం అనుకూలించడం, ఉచిత కరంటుతో దాదాపు 75 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రారంభంలో క్వింటాలు ధర రూ.14వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.55 వేలు పలుకుతున్నది. అధిక ధర రావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పై చిత్రంలో కనిపిస్తున్న రైతు హైమద్. ఈయనది నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామం. తనకు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా మక్క, వరి సాగు చేసేది. మక్కకు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గడం, సర్కారు వరి వేయద్దని చెప్పడంతో ఈసారి నాలుగెకరాల్లో ఆర్మూర్ రకానికి చెందిన మిర్చి వేశాడు. వాతావరణం అనుకూలించడం, 24 గంటల ఉచిత కరంటు ఉండడంతో మిర్చి వైపు మొగ్గు చూపాడు. ఎకరాకు విత్తనాలు, రసాయనిక ఎరువులు, కూలీల ఖర్చులకు రూ.1.25 లక్షలు వెచ్చించాడు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటాలు మిర్చికి రూ.14 వేల నుంచి రూ.15 వేలు పలుకడంతో రూ.3.75 లక్షలు వచ్చాయి. నాలుగెకరాలకు రూ.5 లక్షలు ఖర్చు చేయగా.. రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. అన్ని ఖర్చులు పోనూ రూ.10 లక్షలు మిగిలాయి. ఇంకా.. ఇప్పుడు కూడా మిర్చికి మళ్లీ నీరు పట్టడం, రసాయన మందులు పిచికారీ చేయడంతో రెండో పంట కింద పచ్చి మిర్చి చేతికొస్తున్నది. మార్కెట్లో పచ్చి మిర్చి కిలో ధర రూ.30-40 వరకు పలుకుతుండడంతో నాలుగు ఎకరాలకు మరో రూ.4 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 5 : కేంద్ర సర్కారు వడ్ల కొనుగోలు విషయంలో కిరికిరి పెడుతుండడంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితంగా రైతులు వరిని వదిలి ఇతర పంటలపై దృష్టిసారించారు. ఇందులో భా గంగా మిర్చి పంటను కూడా వేశారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బోర్ల కింద దాదాపు 3 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు దాదాపు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. మొత్తం 75 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉం దని అధికారులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.1.25 లక్షలు ఖర్చువుతుండగా.. రూ.3 లక్షలకుపైగా ఆదాయం వస్తున్నది. గుంటూరు రకంతోపాటు ఆర్మూర్, లోకల్ మిర్చి, తేజ, రాజు వంటి రకాలను సాగు చేశారు. పంట కా లం 180 రోజులు కాగా.. ఆదాయం రెండు నె లల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ప చ్చి మిర్చితో మొదలైన ఆదాయం ఎండు మి ర్చితో కూడా వస్తుంది. మార్కెట్లో పచ్చి మి ర్చికి హోల్సెల్గా కిలో ధర రూ.30-40 పలుకుతుండగా.. ఈసారి రికార్డు స్థాయిలో ఎండు మిర్చి కిలో రూ.200 ధర ఉంది. ఇతర మార్కెట్లలో క్వింటాలు మిర్చి ధర రూ.52 వేలు రి కార్డుస్థాయిలో పలికింది. వాతావరణం అనుకూలంగా ఉండడం, తెగుళ్ల బెడద తక్కువగా ఉండడంతో దిగుబడి అధికంగా వస్తున్నది. వ్య వసాయశాఖ అధికారుల సూచనల మేరకు బ ల్బుల అమరిక, ప్లాస్టిక్ పేపర్ల ఏర్పా టు కలిసొచ్చింది. మన మిర్చి నాణ్యమైనదిగా ఉండడంతో అధిక ధర పలుకుతున్నది. కొం దరు ఎండు మిర్చిని అమ్ముకోగా.. మరికొంద రు ఇ ప్పుడిప్పుడు అమ్ముతున్నారు. చివరగా అమ్మినవారు అత్యధిక లాభాలు గడిస్తున్నారు.
ఈయన పేరు ఎస్డీ ఖమర్. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన రైతు. ఈయనకు ఐదెకరాల భూమి ఉండగా.. ఇందులో రెండు ఎకరాలు మిర్చి ఆర్మూర్ రకానికి చెందినది సాగు చేశాడు. ఆగస్టులో విత్తనాలు తీసుకొచ్చి మిర్చి వేయగా.. 180 రోజుల వరకు పంట దిగుబడి వస్తున్నది. రెండు ఎకరాల్లో మిర్చికి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేయగా.. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో రూ.14వేల వరకు క్వింటాలుకు విక్రయించడంతో రూ.7 లక్షల ఆదాయం వచ్చింది. రెండున్నర లక్షలు పోనూ మిగతా రూ.5 లక్షల ఆదాయం వచ్చింది. ఒకవేళ మక్క, వరి పంటలను సాగు చేస్తే ఈ రెండు ఎకరాల్లో రెండు లక్షలు మిగిలేదని కాదని రైతు పేర్కొన్నారు. ఇతర పంటలతో పోల్చితే మిర్చి పంటకు నిర్వహణ ఖర్చు భారమైనప్పటికి పంటకు మార్కెట్లో డిమాండ్ ఉండటం, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైతు మిర్చిని సాగు చేయడం వల్లనే లాభాలు వచ్చాయి.