ఎదులాపురం, మార్చి 31 : మహనీయుల జయంతి ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు, నాయకులకు సూచించారు. ఏప్రిల్‌లో బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, సంఘాల నాయకులతో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు, కరోనా కారణంగా గత ఏడాది మహనీయుల జయంతి నిర్వహించుకోలేక పోయామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న బాబు జగ్జీవన్‌రామ్ , 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. వివిధ సంఘాల అభిప్రాయాల మేరకు సలహాలు, సూచనల ప్రకారం జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని దళితుల కులుంబాలకు సంక్షేమ ఫలాలు అందేవిధంగా ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా మహిళలకు కనీస వసతులు, భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సంఘాల ప్రతినిధులు తెలిపిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా అన్ని వసతులు కల్పిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రంజాన్ పండుగ ఏర్పా ట్లు, ఉపవాస దీక్షల ప్రారంభం దృష్ట్యా మౌలిక సదుపాయాల కల్పనకు కలెక్టరేట్లో గురువారం ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని మసీదులు, ముస్లిం కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాత్రి 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు పోలీస్, మున్సిపల్ అధికారులు సమష్టిగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదారు రోజులల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల దృ ష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రంజాన్‌కు ఏర్పా ట్లు చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా, ఇతర సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలోని ముస్లిం కుటుంబాలకు 4500 గిఫ్ట్ ప్యాకెట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఇఫ్తార్, తదితర ఏర్పాట్లకు రూ.9 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఏఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్సీడీవో సునీతాకుమారి, ఆర్డీవో రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ముస్లిం పెద్దలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, మార్చి 31 : రంజాన్ పురస్కరించుకొని దారుల్ అన్సర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న సరుకులు పంపిణీ చేశారు. సొసైటీ బాధ్యులను అభినందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, సొసైటీ ప్రతినిధులు నదీమొద్దీన్, ఆరీఫ్ ఖాన్, కీజర్ అహ్మద్, మౌలానా అబ్దుల్ అలీం, నాయకులు పాల్గొన్నారు.