హుస్నాబాద్/ అక్టోబర్ 17 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం మంచి సత్ఫలితాలను ఇస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లో రహదారులకు ఇరువైపులా నాటిన పూలు, పండ్లు, ఇతర మొక్కలు వృక్షాలుగా మారి ప్రయాణికులకు నీడనివ్వడంతో పాటు ఉల్లాసాన్ని కలుగజేస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంతో పాటు డివిజన్ పరిధిలో ఆరు విడుతల్లో నాటిన మొక్కలు రోడ్లకు ఇరువైపులా పచ్చందాలను పంచుతున్నాయి. అడవి తంగేడుతో పాటు ఇతర పూల చెట్లు ఆహ్లాదాన్నిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ప్రస్తుతం రహదారులకు శోభాయమానంగా నిలుస్తున్నాయి.
నందనవనంగా పోలీస్ స్టేషన్
న్యాల్కల్, అక్టోబర్ 17 : న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పోలీస్‌స్టేషన్ పచ్చనంతో హరితవనాన్ని తలపిస్తున్నది. జహీరాబాద్ రూరల్ సీఐ నాగేశ్వర్రావు, హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సిబ్బంది సంరక్షిస్తూ నందనవనంగా మార్చారు. పోలీస్ స్టేషన్ అవరణలో ఏడు విడుతలుగా హరితహారంలో నాటిన మొక్కలను వృక్షాలుగా మలుస్తున్నారు. దీంతో విశాలమైన పోలీస్‌స్టేషన్ ఆవరణ ఎటు చూసినా పచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నది. పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న అల్లాదుర్గం-మెటల్‌కుంట ప్రధాన రహదారిగుండా రాకపోకలు సాగించే ప్రయాణికులు, వివిధ కేసులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు పచ్చని చెట్లు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ ఆవరణలో వివిధ రకాల పండ్లు, నీడనిచ్చే చెట్లు, తీగజాతి, డిజైన్, పూల మొక్కలు అందంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఎటు చూసినా పచ్చదనం..
పోలీస్‌స్టేషన్ ఆవరణలో పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు చెట్ల కింద కూర్చొని సేద తీరుతున్నారు. పోలీస్‌స్టేషన్‌ను హరితస్టేషన్‌గా మార్చడంతో పోలీసులను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అభినందిస్తున్నారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు పోలీస్‌స్టేషన్ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది.
హరితహారాన్ని నిరంతరం కొనసాగిస్తాం
పోలీస్‌స్టేషన్‌లో మొక్కలను సంరక్షించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మరిన్ని మొక్కలు నాటేందుకు కృషి చేస్తాం. పచ్చదనంతో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒత్తిడి జయించి సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలకు పచ్చని చెట్లు నీడనిస్తున్నాయి. సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుని మొక్కలను సంరక్షించడంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి.
-నాగేశ్వర్రావు, జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్
హరిత పోలీస్స్టేన్గా మార్చుతాం..
పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటించాం. ప్రతిరోజు సిబ్బంది మొక్కలకు నీరుపోసి సంరక్షిస్తున్నాం. మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలు చెట్ల కింద సేదతీరుతున్నారు. మరిన్ని మొక్కలను నాటి హరిత స్టేషన్‌గా మార్చేందుకు శాయశక్తుల కృషిచేస్తా.
-వినయ్‌కుమార్, ఎస్సై, హద్నూర్