యాదాద్రి, ఏప్రిల్ 4 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు సోమవారం ఘనంగా అభిషేకం చేశారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలకు భక్తుల రద్దీ కొనసాగింది. ప్రధానాలయాన్ని దర్శించిన భక్తులు మహాద్భుతంగా నిర్మించారని కొనియాడారు. రాత్రి ప్రధానాలయంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చనలు జరిగాయి. యాదాద్రి కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణకట్టలో భక్తుల సందడి నెలకొంది. అనంతరం లక్ష్మీపుష్కరిణీలో భక్తులు పుణ్యస్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం ప్రభాతవేళలో సుమారు గంటన్నర పాటు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి, మహా గణపతి, ఆంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చించారు. శివాలయ ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామి ఖజానాకు రూ. 17,75,028 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి బాలాలయంలో సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ పురోహితులు చరమూర్తులకు నిత్యారాధనలు, రామమానస పూజ, ప్రాతఃకాల మధ్యాహ్నిక పూజలు శైవ సంప్రదాయ రీతిలో నిర్వహించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,33,950
వేద ఆశీర్వచనం 4,200
సుప్రభాతం 14,600
క్యారీబ్యాగుల విక్రయం 11,000
వ్రత పూజలు 1,49,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 44,000
ప్రసాద విక్రయం 11,45,200
వాహనపూజలు 15,100
అన్నదాన విరాళం 2,232
సువర్ణ పుష్పార్చన 1,11,000
యాదరుషి నిలయం 65,680
పాతగుట్ట నుంచి 55,360
లక్ష్మీ పుష్కరిణి 200
ఇతర విభాగాలు 22,106