యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను నట్టేట ముంచే కుట్రలు సాగిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా, ఆపద్బాంధవుడిగా మరోసారి ముందుకు వచ్చారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడుతూనే మరోవైపు రాష్ట్ర రైతులు నష్టపోకుండా సమయోచితంగా స్పందించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగిలో పండిన ప్రతి గింజనూ ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకే కొంటామని ప్రకటించడంతో రైతులు జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ఇది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం మొండికేసినా సరే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతుల్లో సంతోషాన్ని నింపింది. యాసంగిలో ఎక్కువగా సాగయ్యే దొడ్డు రకాల కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. బాయిల్డ్ బియ్యంగా మారిస్తే తీసుకోబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో దొడ్డు రకాలను రారైస్‌గా మార్చి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. నూకల వల్ల జరిగే నష్టాన్ని భరించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించి బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సీఎం ప్రకటనపై రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంబురాలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో రైతుల ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మద్దిరాలలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, సూర్యాపేట మండలంలో రైతులు, యువత పెద్ద ఎత్తున సంబురాల్లో పాల్గొన్నారు. తుంగతుర్తిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, కోదాడలో సహకార సంఘం చైర్మన్ ఆవుల రామారావు, సీపీఐ రైతు సంఘం నాయకులు పైడిమర్రి వెంకటనారాయణ, గరిడేపల్లిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో సంబురాలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని కొనియాడారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు,
జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి మొదలైన కోలాహలం బుధవారం కూడా కొనసాగింది. నల్లగొండలోని ఆర్జాలబావి వద్ద పానగల్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో రైతులు, పార్టీ శ్రేణులు కలిసి ధాన్యం కుప్పల మధ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో జరిగిన సంబురాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. కనగల్‌లో ఎంపీపీ కరీం పాషాతో పాటు పార్టీ నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాలియా మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల సంబురాలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా రూ పొందించిన సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్రపటానికి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. రామడుగులోనూ రైతులంతా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంతోషాన్ని పంచుకున్నారు. త్రిపురారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వినూత్నంగా సంబురాలు నిర్వహించా రు. రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంచందర్‌నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి ధా న్యాభిషేకం చేశారు.
నిడమనూర్ మండల కేంద్రంలోనూ పార్టీ నేతలు, రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోనూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ‘జై కేసీఆర్.. జై తెలంగాణ’ అం టూ నినాదాలు చేశారు. మునుగోడు మండలం కేంద్రంలో ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ పా ర్టీ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కట్టంగూరు మండల కేంద్రంలో పార్టీ నేతలు, రైతులతో కలిసి సంబురాలు చేశారు. ఉమ్మడి జిల్లా అంతటా రైతులు సంబురాల్లో మునిగి తేలారు. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీరుతో ఆందోళన చెందిన రైతులకు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎంతో ధైర్యాన్నిచ్చిందనే చర్చ సర్వత్రా వినిపించింది.