యాసంగిలో పండిన ప్రతి వడ్ల గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, రైస్‌మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావచ్చని, అందుకోసం 934 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని, గన్నీ బ్యాగులు, కాంటాలు, తదితర వాటిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దొడ్డు, సన్నరకం ధాన్యాన్ని సేకరించి గతంలో మాదిరిగానే రైతుల ఖాతాల్లో డబ్బు జమచేయనున్నట్లు చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.
నల్లగొండ ప్రతినిధి (నమస్తే తెలంగాణ)/నల్లగొండ, ఏప్రిల్ 13 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో పండిన ప్రతి వడ్ల గింజనూ కొనుగోలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు జరుపాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియ ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధులతో పాటు అవసరాన్ని బట్టి వివిధ ప్రభుత్వ శాఖల సేవలను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.
బుధవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్యభవన్‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, రైస్‌మిల్లర్స్ ప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తక్షణమే శ్రీకారం చుట్టాలని, వాటిల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, కాంటాలు, తదితర అవసరాలపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని వంచనకు గురి చేసేందుకు కుట్రలు చేయగా సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా, వ్యవసాయరంగం బాగు కోసం నిరంతరం తపించే వ్యక్తిగా ఎంత నష్టమైనా భరించి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధపడ్డారని తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూనే వెంటవెంటనే చెల్లింపుల ప్రక్రియను కూడా చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందకుండా, అధైర్యపడకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావచ్చని, అందుకోసం 934కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యానికి మద్దతు ధరను ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఎవరు అలసత్వం ప్రదిర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్లు సైతం సన్న ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతులను మోసం చేసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధర విషయంలో కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దులో గట్టి నిఘా ఉంచాలని పోలీస్‌శాఖను ఆదేశించారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, నల్లగొండ, యాదాద్రి జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్ కుమార్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, కలెక్టర్లు ప్రశాంత్ జీవన్‌పాటిల్, పమేలా సత్పతి, వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్, జిల్లా వ్యవసాయ, సివిల్ సైప్లె, డీఆర్డీఏ, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.
సన్నాలు, దొడ్డు రకాలు అనే తేడా లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, రైతులు అధైర్య పడి తక్కువ ధరకు దళారులకు అమ్మి నష్టపోవద్దని మంత్రి సూచించారు. కొనుగోళ్లపై యాక్షన్ ప్లాన్‌ను అధికారులను అడిగి తెలుసుకుని, సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా, కేంద్రాల సంఖ్య, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. గతేడాది మాదిరిగానే రూ.1960ల మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వెన్నుచూపి మోసగించినా సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేస్తున్నందున ఉమ్మడి జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అన్ని సమస్యలనూ అధిగమిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చామన్నారు. 24 గంటల విద్యుత్, చెరువుల పునరుద్ధరణ, పెరిగిన భూగర్భ జలాల కారణంగా ధాన్యం ఉత్పత్తి 40లక్షల మెట్రిక్ టన్ను ల నుంచి మూడు కోట్ల టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో మూడేండ్ల పాటు కరువు వచ్చినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని, కేం ద్రం దురుద్దేశ పూర్వకంగా కుట్రలకు పాల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నేడు ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయిస్తలేరని ప్రశ్నించారు. దొంగల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నీటి వనరులు పెరుగడంతో పాటు 24 గంటల విద్యుత్ ఇస్తున్నందున వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో 60శాతానికి పైగా నిధులు కేటాయించిందన్నారు. కానీ, కేంద్రం మాత్రం వ్యవసాయ రంగాన్ని నిర్వీ ర్యం చేసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడేదెవరో, నిలబడనిదెవరో ఇప్పటికైనా తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని స్పష్టంగా తెలిందని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత యాసంగిలో 19.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 14.50లక్షల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గతేడాది మాదిరిగానే 934 కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరాన్ని బట్టి మరిన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, కొనుగోలు కేంద్రాలను రోజూ సందర్శించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి కేంద్రంలోనూ ధాన్యం కొనుగోళ్ల వివరాలను వెంటనే ట్యాబ్‌లో అప్లోడ్ చేయాలని, ఔట్ సోర్సింగ్ కాకుండా రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని సూచించారు. గన్నీ బ్యాగులు, రవాణా విషయంలో అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దేశంలో గతంలో పంజాబ్ అత్యధికంగా ధాన్యం పండిస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పండిస్తుందని అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంచి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని, దశలవారీగా అన్ని కేంద్రాలను తెరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.
వరి నాట్లు వేయమన్నది వారే.. అమాయక రైతాంగాన్ని వంచనకు గురి చేస్తున్నది వారేనంటూ బీజేపీ నేతలపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగంలో అవగాహన పెంపొందిస్తుంటే బీజేపీ నేత బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి వరి నాటు పెట్టించారని, తీరా ధాన్యం చేతికందే సమయానికి మొహం చాటేసి రైతులను గందరగోళంలోకి నెట్టారని ఆగ్రహించారు. ఈ సమయంలో కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించినా ఫలితం లేకపోవడంతో మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారని తెలిపారు.