కొండాపూర్: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని లింగంపల్లి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల రైల్వే సమస్యలను పరిష్కరించాలంటూ చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీలు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యకు వినతి పత్రం అందజేశారు.
శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకు విచ్చేసిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలపై అరగంటకు పైగా చర్చించారు. స్టేషన్లలో మౌళిక సదుపాయాల కల్పనతో పాటు రక్షణ విభాగాలను మరింత పటిష్టం చేయడం వంటి విషయాలను ప్రస్తావించినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
దీంతో పాటుగా లింగంపల్లి, వికారాబాద్, తాండూరుల రైల్వే స్టేషన్లు నిత్యం రద్దీగా ఉండడంతో పాటు పలు ప్రధాన రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయని, ముఖ్యమైన స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల నిలుపుపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు.
దీనిపై సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, జగదీశ్వర్‌గౌడ్, శ్రీకాంత్, శ్రీనివాస్ రావు, లింగంపల్లి రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.