జూబ్లీహిల్స్ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీలలో కార్పొరేటర్ వైద్య సేవలు అందించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్‌గూడ బస్తీలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్‌లతో కలిసి బస్తీ దవాఖానను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడొద్దని, ప్రైవేట్ దవాఖానలలో లక్షలాది రూపాయలు వెచ్చించి అప్పులపాలు కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో బస్తీ దవాఖానలతో నాణ్యమైన వైద్య సేవలకు రూపకల్పన చేశారన్నారు.
పేదలకు ఆరోగ్యపరమైన ఏ కష్టం వచ్చినా బస్తీ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించి ఏ ప్రైవేట్ దవాఖానలో అందని భరోసా కల్పించి వారికి అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమన్నారు. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే 250 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 50 దవాఖానాలు పెంచేలా కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.శ్రీనివాస్, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, జోనల్ కమిషనర్ ప్రియాంక, డిప్యూటీ కమిషనర్ రమేష్, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పిహెచ్ఓ డాక్టర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.