ఎదులాపురం,ఏప్రిల్7: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమవేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ముందుగా ప్రాథమిక స్థాయిలో విద్యాప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన ద్వారా శిక్షణ అధికారులు అశోక్, నర్సయ్య వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ సాధన సర్వే ప్రకారం చదువులో వెనుకబడిన పాఠశాలల్లో విద్య ప్రమాణాల మెరుగునకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచి, ప్రత్యేక తరగతుల ద్వారా బోధించాలని సూచించారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు చదవడం ,రాయడంతో పాటు వినడం, మాట్లాడించడం నేర్పించాలని చెప్పారు. పిల్లల్లో విద్యా సామర్థ్యాల పెంపునకు తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలన్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మన ఊరు -మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో కల్పించే మౌలిక వసతులతో విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని ఆకాంక్షించారు. ప్రతి పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. దీక్ష పోర్టల్ ద్వారా అందించే శిక్షణను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో డీఈవో ప్రణీత, జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్, ఎంఈవోలు, కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.