కరీమాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మనఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8 తరగతి వరకు ప్రారంభం కానున్న ఆంగ్ల మాధ్యమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. ఖిలావరంగల్ మండల పరిధిలోని ఉపాధ్యాయులకు శంభునిపేట ప్రభుత్వ పాఠశాల, మామునూరులోని జడ్పీహెచ్ఎస్, ఉర్సులోని తాళ్ల పద్మావతి పాఠశాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం నర్సిరెడ్డి మాట్లాడుతూ సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధించాలనుకోవడం శుభపరిణామన్నారు. ఆంగ్లమాధ్యమం వల్ల పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయని తెలిపారు. ఆధునిక యుగంలో ఇంగ్లిష్ విద్య కీలకంగా మారిందన్నారు. ఉర్సు తాళ్ల పద్మావతిలో డీఈవో వాసంతి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8 తరగతి వరకు అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యాశాఖ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పని చేయాలని సూచించారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాని కోరారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం శారదాబాయి ఆధ్వర్యంలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు.
దుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో సర్కారు బడులకు పూర్వ వైభవం వస్తుందని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని దేశాయిపల్లి, రేబల్లె, లక్ష్మీపురం, పొనకల్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల గదులు, ఆవరణల్లో తిరిగి వసతులను పరిశీలించారు. ఆయా స్కూళ్లలో కావాల్సిన వసతులపై చర్చించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలని శ్రీనివాసరావు కోరారు. ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు సమన్వయపర్చుకుంటూ ఇన్పుట్ డేటా ఫారాలు, పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. పాఠశాలలను వంద శాతం అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో చదువుల సత్యనారాయణ, సర్పంచ్లు పాశం పోశాలు, గటిక మమతాప్రభాకర్, పాండవుల సురేశ్, బొమ్మగాని ఊర్మిళా వెంకన్న, ఎంపీటీసీలు బండి జగన్నాథం, మామునూరి సుమన్, మోర్తాల రాజు, హెచ్ఎంలు ముత్తినేని శ్రీనివాస్, బండారి రఘు, రమేశ్, ఖాజామైనొద్దీన్ పాల్గొన్నారు.