ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైనది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్స్తోపాటు ఇన్విజిలేటర్స్‌ను నియమించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 60,915 మంది ఉండగా 111 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది.
రామగిరి, మార్చి 2 : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఇక వార్షిక పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షల విధినిర్వహణలో ఇంటర్మీడియేట్ జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు పాల్గొననున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, అధికారులు సైతం సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకోసం అన్ని వసతులు కల్పించారు. తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నది. అయితే గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలకు 60,915 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో 29,563 మంది, ద్వితీయ సంవత్సరంలో 31,352 మంది హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా డివిజన్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీటిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
భువనగిరి, కలెక్టరేట్ : ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలలో 13,309 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను స్టోరేజ్ కోసం 11 పాయింట్లు ఉన్నాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయాల్లో జీరాక్స్ సెంటర్లు మూసి వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ కేవీ ఉపేందర్‌రెడ్డి, ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్. రమణి పాల్గొన్నారు.
ఇంటర్ విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే సీఎస్, డిపార్ట్ట్మెంట్ అధికారులకు శిక్షణ ఏర్పాటు చేశాం. ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలతోపాటు జిల్లా పరీక్షల విభాగం అధికారులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షణ చేయనున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాం.
– జె.కృష్ణయ్య, డీఐఈఓ, సూర్యాపేట