రైతన్న కోసం స్థానిక సంస్థల పాలకవర్గాలు ఒక్కటవుతున్నాయి. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని నిన్నటి వరకు జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, రైతుబంధు సమితి, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయగా.. తాజాగా మున్సిపాలిటీలు అదేబాటలో నడిచాయి. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని పంజాబ్‌లో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశాయి. ఈ మేరకు గురువారం ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పాలవర్గాలు ఏకగ్రీవ తీర్మానం చేసి, ప్రధాని మోదీకి పంపించాయి.
కార్పొరేషన్, మార్చి 31: పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనేదాకా కేంద్రంతో కొట్లాడుతామంటూ స్థానిక సంస్థల పాలకవర్గాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, రైతుబంధు సమితి, మార్కెట్ కమిటీ సింగిల్ విండోలు ఏకగ్రీవ తీర్మానాలు చేయగా, గురువారం మున్సిపల్ పాలక వర్గాలు వాటిని అనుసరించాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర సర్కారు అన్నదాతకు అండగా నిలుస్తుంటే కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపడం సరికాదని హితవు పలికాయి. రాష్ట్ర రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనాలని, అన్నదాతను ఆదుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి.
రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ వై సునీల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తీర్మానం ప్రవేశ పెట్టగా, పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలోనూ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ పత్రాలను పంపించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తెలిపారు. అటు జమ్మికుంట మున్సిపల్ పాలకమండలి సైతం ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానం ప్రతిని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, తహసీల్దార్ రాజారెడ్డికి అందించారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు ఆధ్వర్యంలో జరిగిన పాలకమండలి ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. చొప్పదండిలో చైర్పర్సన్ గుర్రం నీరజ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి, పత్రాన్ని కలెక్టర్ ద్వారా ప్రధాని మోదీకి పంపించారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి కొప్పుల సమక్షంలో రైతులకు మద్దతుగా ధాన్యం కొనుగోళ్లపై సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతులను ఢిల్లీలోని ప్రధాని మోడీ అధికార నివాస కార్యాలయానికి చేరవేయనున్నట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ హాజరయ్యారు. జగిత్యాల పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జరగగా, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సమక్షంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి, తీర్మాన ప్రతిని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు అందజేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన నాలుగో అత్యవసర సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి, పత్రాలను పోస్టు ద్వారా ప్రధాని మోదీకి పంపించారు. వరి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంథని మండల ప్రజాపరిషత్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంపీ వెంకటేశ్ నేతకానితోపాటు సభ్యులంతా ఏకవాక్య తీర్మానం చేశారు.సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశాల్లో సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రాష్ట్ర రైతాంగం యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా వారి అభ్యున్నతికి కృషి చేస్తుంటే కేంద్రం ఇలాంటి కొర్రీలు పెట్టడం సరికాదు. రాష్ట్రంపై వివక్ష చూపుతూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదు. రైతన్న కన్నెర్ర జేస్తే కేంద్ర ప్రభుత్వం కాలి, కూలిపోవడం ఖాయం.
– బుగ్గారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని బరాబర్ కేంద్రమే కొనుగోలు చేయాలి. లేదంటే సీఎం కేసీఆర్ నేతృత్వంలో గల్లీ నుంచి ఢిల్లీదాకా శక్తివంచనలేకుండా పోరాడుతాం. మోదీ సర్కారు తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. రైతులపై కనీసం కనికరం చూపడం లేదు. వడ్లను కొనకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి.
– మంథని మండల పరిషత్‌లో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని