ఆదిలాబాద్ జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం వాడీవేడిగా సాగింది. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు కొన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యంపై నిలదీశారు. దాదాపు ఆరున్నర గంటల పాటు 28 అంశాలపై చర్చించారు. అధికారుల తీరుకు నిరసనగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా బోథ్ ఎంపీడీవోను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రకటించారు.
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 9: దేవుడు వరమిచ్చినా పూజారి పడనీయని చందంలా కొందరు జిల్లా అధికారుల కారణంగా ప్రజాప్రతినిధులు, సామాన్యులు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశం శనివారం నిర్వహించగా, ఉదయం 11 గంటలకు మొదలై, సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తంగా దాదాపు ఆరున్నర గంటలపాటు 28 అంశాలపై చర్చ సాగింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో తొలి విడుతలో 237 పాఠశాలలు ఎంపిక చేశామని, మూడు విడుతల్లో గిరిజన ప్రాంత పాఠశాలలు ఎంపికచేస్తామన్నారు. దీనిపై జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్ , గోక గణేశ్రెడ్డి తదితరులు మాట్లాడారు.
ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య తాను నివేదికలు ఇచ్చానని ముందు చెప్పారు. తరువాత సభ్యులు నిలదీయడంతో సోమవారం నివేదికలు అందిస్తామని వివరణ ఇవ్వగా, ఆయనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా ఈ కార్యక్రమం కింద తీసుకున్న పాఠశాలల అభివృద్ధి వేగవంతం చేయాలని, తదుపరి జాబితాలో మరిన్నింటిని చేర్చాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. ఉన్నతాధికారులు సహా మండల అధికారులకు కూడా అభివృద్ధి పనులపై అవగాహన లేకనే ఇలా జరుగుతున్నదని అసహనం వ్యక్తంజేశారు. డీఈవో ప్రణీత విద్యాశాఖకు సంబంధించిన నివేదిక చదివి వినిపించారు.
ప్రభుత్వం పెద్ద లక్ష్యంతో మిషన్ భగీరథ అమలు చేస్తున్నదని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో ఇంటింటికీ శుద్ధ జలం అందించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలే రావని పేర్కొన్నారు మిషన్ భగీరథలో అధికారుల మూలంగానే అభాసుపాలవుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ , అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీవో కిషన్ , వివిధ శాఖల అధికారులు , జడ్పీటీసీలు,ఎంపీపీలు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో ఉపాధిహామీ సోషల్ ఆడిట్ సందర్భంగా అవకతవకలు గుర్తించారని, ఈ విషయంలో బాధ్యులపై కలెక్టర్ చర్యలు తీసుకోలేదని నిరసనగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వాకౌ ట్ చేశారు. దీంతో బోథ్ ఎంపీడీవోను సస్పెన్షన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. దీనిని నిరసిస్తూ బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ సమావేశంలోనే కింద కూర్చున్నారు. తరువాత వాకౌట్ చేశారు. తాను నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నానని, అవినీతి,అక్రమాలకు పాల్పడే ఎవరినీ వదిలేదని లేదని కలెక్టర్ స్పష్టంచేశారు. ఐటీడీఏ పీవో హాజరు కాకపోవడంపై సభ్యులు నిరసన వ్యక్తంజేశారు.