ఎదులాపురం, ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ఎస్సీ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్తోకలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేశారు. అనంతరం బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో దళితబంధు పథకం కింద రూ.24.90 కోట్లతో 249 కుటుంబాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. గురువారం 73 దళిత కుటుంబాలకు రూ.7.30 కోట్ల వాహనాలను అందించామని పేర్కొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు నగదు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
కులాంతర వివాహం చేసుకున్న నలుగురు దంపతులకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. అలాగే దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు అందించారు. ఎస్సీ స్డడీ సర్కిల్లో శిక్షణ పొంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు పొందిన 35 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఐదుగురు ఎస్సీ దివ్యాంగులకు బ్యాంకుతో సంబంధం లేకుండా వ్యాపార నిమిత్తం రూ.లక్ష చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రమేందర్, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, డీఎస్సీడీవో భగత్ సునీత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ పాల్గొన్నారు.