ఓలా.. ఒకప్పుడు ముల్లె మూటా సర్దుకొని గల్ఫ్‌బాట పట్టిన ఊరు.. బతుకుజీవుడా అంటూ దుర్భర పరిస్థితులు అనుభవించిన జనం.. ఎటుచూసినా నోళ్లు తెరిచి బీడువారిన భూములు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు కానరాని పల్లె.. విద్య, వైద్యం, ఉపాధి అంటే తెలియని యువత.. ఒకటేమిటి అన్ని రంగాల్లో వెనుక బడిన గ్రామం.. ఇప్పుడు.. ఎడారి దేశం వెళ్లిన వారు తిరిగిరావడంతో పల్లె కళకళలాడుతున్నది. ఎవుసాన్ని రాష్ట్ర సర్కారు పండుగలా మార్చడంతో ఎటుచూసినా పచ్చని పైర్లు కానవస్తున్నాయి.
సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా మార్చడంతో ఉన్న ఊరిలోనే ఉపాధి, ఉద్యోగం పొందుతూ సబ్బండ వర్గాలు సుఖంగా బతుకున్నాయి. ఈ ఎనిమిదేండ్లలో స్వయం సమృద్ధి సాధిస్తూ.. ప్రగతి బావుటా ఎగురవేస్తున్నది.. అదే నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామం.. ఈ పల్లెపై ఫీల్డ్ విజిట్ కథనం..
నిర్మల్ టౌన్, మే 12 : పల్లెల ముఖచిత్రం మారిపోయింది. గతంలో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు కొందరైతే, పొట్ట చేతబట్టుకొని పట్నాలకు వెళ్లి చాలీచాలని వేతనాలతో బతుకు జీవుడా అంటూ కాలం గడిపినవారు మరికొందరు.
వ్యవసాయ భూములున్నా పంటలు పండక, యేటా కష్ట నష్టాలే తప్పా లాభాల్లేని పల్లె.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చుకుంది. ఎనిమిదేండ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి తలుపు తట్టగా, పల్లె ప్రగతితో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూరాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదేండ్ల కాలంలో కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో మారిన ముఖచిత్రంపై ప్రత్యేక కథనం..
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో మొత్తం 950 కుటుంబాలున్నాయి. గ్రామ జనాభా 3848 పైమాటే. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో కోటితో డంప్ యార్డు, దోభీ ఘాట్, రైతు వేదిక, వైకుంఠ ధామం నిర్మించారు. హరితహారం ద్వారా సుమారు 500 మొక్కలను పెంచారు. ఈజీఎస్ నిధులతో ఇప్పటివరకు 2వేల మీటర్ల సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు.
గ్రామంలో మొత్తం 125 విద్యుత్ స్తంభాలుండగా, మరో కొత్త 40 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి హైమాస్ట్ లైట్లు, ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. మిషన్ భగరీథ కింద లక్ష లీటర్లతో కొత్త ట్యాంక్‌ను నిర్మించిన అధికారులు, 924 కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్యను పరిష్కరించారు. 770 మందికి ఆసరా పింఛ న్లు అందుతున్నాయి. మొత్తం గ్రామంలో పింఛన్ల కింద రూ. 14,20,720 చెల్లిస్తుండడంతో పల్లెల్లో పేద ప్రజలకు భరోసా ఏర్పడింది.
గ్రామంలో 35 సంఘాలుంటే ఇప్పుడు 75కు పెరిగాయి. రూ. 39 కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్నారు. గ్రామంలో 96 మంది పేద యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి ద్వారా రూ. 70 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా 24 మందికి సుమారు సుమారు రూ. 21 లక్షలకు పైగా అందించారు.
ఓలా పూర్తి వ్యవసాయ అనుబంధ గ్రామం. ఈ గ్రామంలో 849 మంది రైతులకు రైతుబంధు కింద రూ.1,32,1853 కోటి 32 సాయం అందుతున్నది, రైతు బీమా కింద 15 మందికి రూ. 75 లక్షల సాయం అందగా.. 45 మంది రైతులకు రూ. 20.50లక్షల రుణమాఫీ ఇప్పటికే అమలైంది. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామంలో సాగు గణనీయంగా పెరిగింది. గతంలో మొత్తం 3725 ఎకరాల భూమి ఉంది.
ఇందులో 2,850 ఎకరాల భూమి, 2014కు ముందు సాగు చేసేవారు. ప్రస్తుతం మరో 875 ఎకరాలు సాగులోకి వచ్చాయి. గ్రామంలో 2014లో కేవలం 150 వ్యవసాయ బోర్ల కనెక్షన్లుండగా, ఇప్పుడు 450కి చేరుకుంది. ట్రాన్స్ఫార్మర్లు 8-15కు పెరగగా.. రూ. 3.50కోట్లతో కుంటాల-లింబా రహదారిపై కొత్త సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో ఓలా గ్రామంలో రైతులు పండించే పంటలకు 24 గంటల కరెంటు అందుతోంది. మిషన్ కాకతీయ ద్వారా రూ. కోటి ఖర్చు చేసి గ్రామంలో మూడు చెరువులకు మరమ్మతులు చేయగా, భూగర్భజలాలు, మత్స్య సంపద పెరిగింది.
27 ప్యాకేజీ కింద ఓలా గ్రామంలో కాలువ నిర్మాణ పనులు చేపట్టగా.. 162 మంది రైతులకు రూ. 3.62కోట్ల భూపరిహారం కింద చెల్లించారు. గతంలో పత్తి, జొన్న, వరి మాత్రమే సాగు చేయగా.. ఇప్పుడు పండ్ల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటలు, తదితర 20 రకాల పంటలను సాగు చేస్తున్నారు.
పల్లెల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు 24 గంటల కరెంటు నేపథ్యంలో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగిపోవడంతో గ్రామంలో వాణిజ్య వ్యాపారం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు 24 గంటల కరెంటుతో సాగు పెరిగింది. 2014కు ముందు వ్యవసాయ ఉత్పత్తులతో పోల్చితే ఇప్పుడు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ వాహనాల సంఖ్య కూడా పెరిగింది. 2014లో గ్రామంలో 8 ట్రాక్టర్లుండగా.. ఇప్పుడు 22 ట్రాక్టర్లున్నాయి.
నాలుగు హార్వెస్టర్లు, 2 జేసీబీలు, పది టిప్పర్లు, 250 బైక్‌లు, 50 గూడ్స్ వ్యవసాయ పంట ఉత్పత్తులను తరలించే వాహనాలు కొనుగోలు చేయడంతో వారందరికీ ఉపాధి లభిస్తోంది. గతం లో మెడికల్ షాపు ఒకటి ఉండగా.. ఇప్పుడు 3 మెడికల్ షాపులు ఏర్పడ్డాయి. ఇతర వ్యాపార దుకాణాలు 20 ఉండగా.. ప్రస్తుతం 50కి చేరుకున్నాయి. లక్ష రూపాయల వ్యాపారం జరిగే ఈ గ్రామం లో ప్రస్తుతం రూ.2లక్షలకుపైగా వ్యాపారం జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. గ్రామంలో గతంలో 200కు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే ఉపాధి పొందిన వారంతా ఇప్పుడు సొంత గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు నిర్వహించుకుంటున్నారు. వీరంతా కూడా అమ్మనాన్నలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. 2014కు ముందు 200 మంది గల్ఫ్ దేశాల్లో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 50 లోపే ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం గురుకులాల విద్యను అమలు చేయడంతో 2014కు ముందు కేవలం 10-12 మంది విద్యార్థులు గురుకుల విద్యా సంస్థల్లో చదివితే ఇప్పుడు ఆ సంఖ్య వందకు చేరుకుంది. గ్రామంలో కూన ఇండ్లు ఉండగా.. ఇప్పుడు వంద పక్కా ఇండ్లు నిర్మించారు. రూ. 3.50కోట్లతో కుంటాల నుంచి ఓలా గ్రామం వరకు డబుల్‌రోడ్డు, ఓలా వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో శివాలయంతో పాటు ఎల్లమ్మ, వీరహనుమాన్, పెద్దమ్మ ఆలయాలకు రూ. 75 లక్షలు నిధులు మంజూరు కావడంతో ఇప్పటికే రెండు మందిరాలను నిర్మించారు.
2014కు ముందు 20 మందికి ఉద్యోగాలుండగా.. ప్రభుత్వం కొలువుల భర్తీ చేపట్టగా.. 50కి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను ఇవ్వగా.. గ్రామంలో 178 మందికి రేషన్‌కార్డులుండగా.. కొత్తగా మరో 25 మందికి రేషన్‌కార్డులను మంజూరు చేశారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఎంతో మంచి చేస్తున్నడు. రైతుబంధు పథకం మమల్ని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నది. నాకున్న ఐదెకరాలకు వానకాలం, యాసంగి సీజన్లలో రూ. 50 వేలు రైతుబంధు సాయం అందుతున్నది. వీటితోనే పెట్టుబడి పెట్టి పంట వేస్తున్న. గతంలో అప్పులను చేసి ఎన్నో ఇబ్బందులు పడిన. ఇప్పుడు సర్కారే సాయం చేస్తున్నది. ఇంతకన్న మంచిగ గతంలో చేసినోళ్లను నేనైతే సూడలే.
-రొడ్డ విఠల్, రైతు
మాది పేద కుటుంబం. మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించింది. మేము ఇద్దరం అన్నదమ్ములం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాం. బీఈడీ, పీజీటీ పూర్తి కాగానే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న. 2018లో మైనార్టీ గురుకుల పాఠశాల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకొని పరీక్ష రాయగా, నేను గురుకుల పాఠశాల అధ్యాపకుడిగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టిన. తెలంగాణలో యువతకు ఉపాధికి ఎన్నో వనరులున్నయ్. ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
-మేదరి మహేశ్, మైనార్టీ గురుకుల పాఠశాల, భైంసా
ఐదేండ్ల నుంచి ఓలా గ్రామానికి వచ్చి ఇక్కడే వ్యవసాయ సీజన్లో కూలీ పనులు చేస్తూ ఏడాదికి 9 నెలలు ఇక్కడే ఉంటున్నం. బిహార్ రాష్ట్రంలో 24 గంటల కరెంటు, సాగునీటి వనరులు లేకపోవడంతో అక్కడ పంటలు పండక ఉపాధి లేక తెలంగాణకు పొట్టకూటి కోసం వస్తున్నం. ఇక్కడ 24 గంటల కరెంటుతో పంటలు బాగా పండుతున్నయ్. వరి ధాన్యం తూకం వేయడం, సోయా పంట కటింగ్ చేయడం, ఇతర వ్యవసాయ పనులు చేస్తూ ఇక్కడే ఉపాధి పొందుతున్నం. నెలకు రూ. 15-20 వేల వరకు ఆదాయం రావడం చాలా సంతోషంగా ఉంది.
-దినేశ్, బిహార్ కూలీ
2014కు ముందు మా గ్రామంలో 24 గంటల కరెంటు లేకుండే. వానలు పడితేనే పంటలు పండేవి. లేకుంటే ఎండేవి. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరంట్ ఇవ్వడం వల్ల మాకున్న ఆరెకరాల భూమిలో మొత్తం పంటను పండిస్తున్నం. గతంలో ఏడాదికి రూ. లక్షా 25 వేలు మాత్రమే వచ్చేటివి. ఇప్పుడు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వస్తున్నయ్. పత్తి, సోయా, మక్క పంటలు ప్రధానంగా వేస్తున్నం.
-తర్ల బక్కయ్య, రైతు, ఓలా
మాది వ్యవసాయ కుటుంబం. మాకున్న నాలుగెకరాలే జీవనాధారం. గతంలో పనుల్లేక , పొట్టకూటి కోసం గల్ఫ్‌కు పోయిన. మూడేండ్లున్న. దొరికిన్నాడే పని.. లేకుంటే మస్తు కష్టమయ్యేది. ఇగ ఆడ ఉండలేక, పెట్టాబేడా సర్దుకొని, మళ్లీ ఊరికొచ్చిన. నాన్నకు తోడుగా ఎవుసం చేస్తున్న. 2014కు ముందు కరంట్ కోతలు మస్తుగుండే. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటల కరంట్ ఇస్తూ, రైతులకు మంచి చేస్తున్నది. కొత్తగా బోరు వేసుకొని, పంటలు పండిస్తున్న. ఇప్పుడు ఈడనే పని మంచిగున్నది.
-బొంతల ప్రశాంత్, ఓలా