ఆదిలాబాద్, ఏప్రిల్ 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో రైతులు నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గు రువారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, లారీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో రెండు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో గతేడాది యాసంగిలో 90 వేల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేయగా.. ఈ సారి 69 వేల ఎకరాల్లో వేసినట్లు చెప్పారు. ఎకరాకు 22 నుంచి 24 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పంట మార్కెట్‌కు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.1960తో వడ్లను కొనుగోలు చేస్తామన్నారు. గతేడాడి యాసంగిలో జిల్లాలో 1.82 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరించగా.. ఇందుకు సంబంధించిన డబ్బులు రూ.344 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు.
నిర్మల్ జిల్లాలో ఈ నెల 25 నుంచి వడ్లను కొనుగోలు చేయడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసి పంటను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో 196 కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను రైతుల నుంచి కొనాలన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 32 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 93, డీసీఎంఎస్ 66, జీపీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఐదు చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులను సరఫరా చేయాలని, మిల్లర్లు పంటను నిల్వ ఉంచడానికి అవసమరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, కూలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. లారీ యజమానులు గ్రామాల్లో సేకరించిన వడ్లను రైస్ మిల్లులకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని అవసరమైన వాహనాలను సమకూర్చుకోవాలని కోరారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి వరి జిల్లాలోకి రాకుండా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ముథోల్ ఎమ్మల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, రైస్ మిల్లర్లు, లారీ యజమానులు పాల్గొన్నారు.