e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు

శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు

శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు

మిల్లులకు తరలింపు
రైతుల ఖాతాల్లో డబ్బులు

ధర్మారం, మే17: మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సాగుతుండగా, రైతులు విక్రయించిన ధాన్యానికి డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి. తూకం చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. గత నెల 18వ తేదీన లంబాడి తండా (బీ)లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మిగతా కేంద్రాలను ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్‌ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌ రెడ్డి వేర్వేరుగా ప్రారంభించారు.

నంది మేడారం సింగిల్‌ విండో పరిధి పెర్కపల్లి, లంబాడి తండా (బి), చామనపల్లి, ఎర్రగుంటపల్లి, బొమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి, నంది మేడారం, గోపాల్‌రావుపేట, సాయంపేట, బొట్లవనపర్తి, ఖిలావనపర్తి, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి, ఖానంపల్లి, పైడిచింతలపల్లి, రామయ్యపల్లి, దొంగతుర్తిలో కేంద్రాలు, పత్తిపాక సింగిల్‌ విండో పరిధిలో పత్తిపాక, నర్సింగాపూర్‌, మల్లాపూర్‌, కమ్మర్‌ఖాన్‌పేట, లంబాడితండా (కె), అబ్బాపూర్‌లో కేంద్రాలు, సెర్ప్‌ పరిధిలోని కటికెనపల్లి, కొత్తూరు, రచ్చపల్లిలో కేంద్రాలు, ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండలం మొత్తం మీద నంది మేడారం సింగిల్‌ విండో పరిధిలో 17 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతులకు బారదాన్‌ (గోనె సంచులు) అందుబాటులో ఉంచారు. 17 శాతం తేమ శాతాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఏఈవోలు నిర్ధారణ చేసిన అనంతరం హమాలీలు తూకం చేస్తున్నారు. రైతులు సజావుగా తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకుంటున్నారు. కొనుగోళ్ల తీరును ప్యాక్స్‌ చైర్మన్లు బలరాంరెడ్డి, వెంకటరెడ్డి పర్యవేక్షించారు. వారు కేంద్రా ల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండడంతో కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి.
పెరిగిన అవగాహన ..
ధాన్యం శుభ్రం చేసే విషయంపై రైతులకు ఎంతో అవగాహన కల్గింది. గత వానకాలంలో సన్న రకాలు పండించి విక్రయించిన సమయంలోనే ధాన్యాన్ని శుభ్రం చేయడాన్ని రైతులు అలవాటుగా మార్చుకున్నారు. ధర్మా రం వ్యవసాయ మార్కెట్‌తో పాటు పలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు ఉండడంతో రైతులు తప్ప, తాలు లేకుండా తూ ర్పార పడుతున్నారు. రైతులు ట్రాక్టర్లకు ఫ్యాన్లు బిగించుకొని ధాన్యాన్ని శుభ్రం చేస్తున్నారు. రైతులకు తరుగు లేకుండా ధాన్యం తూకం వేస్తుండగా, ఆ మేరకు నిర్దిష్టంగా డబ్బులు వారి ఖాతాలో జమ అవుతున్నాయి.
కంప్యూటర్‌లో నిక్షిప్తం..
ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్రంలో రైతుల ధాన్యం విక్రయించిన పట్టీతోపాటు భూమి డిజిటల్‌ పట్టా పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ పత్రాలు అందించగానే సెంటర్‌ ఇన్‌చార్జిలు వాటి వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఆయా శాఖలు వివరాలు వెళ్లగానే చెల్లింపులు జరుగుతున్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న సమయంలో డబ్బులు జమ చేయడంలో జాప్యమవుతున్నది. వరి ధాన్యం గ్రేడ్‌ ఏ ధర క్వింటాలుకు రూ. 1,888, కామన్‌ రకానికి రూ. 1,868 మద్దతు ధర ఉంది. ఇప్పటి దాకా నంది మేడారం సింగిల్‌ విండో పరిధిలో 1,946 మంది రైతుల నుంచి 1,36, 032 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ. 8,87, 39,764 సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. పత్తిపాక సింగిల్‌విండో పరిధిలో 570 మంది రైతుల నుంచి 43,590 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ. 3,61, 57,111 సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో వేశారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏఎంసీ ద్వారా 194 మంది రైతుల నుంచి 7,715 క్వింటాళ్లు, రైతులకు రూ. 60 లక్షల సొమ్మును బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఇక సెర్ప్‌ పరిధిలో 240 మంది రైతుల నుంచి 15,673 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 95,00,000 డబ్బులు చెల్లించారు. ఇంకా కొందరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావాల్సి ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు

ట్రెండింగ్‌

Advertisement