కోటపల్లి, ఏప్రిల్ 11 : మండలంలో జరగనున్న ప్రాణహిత నది పుష్కరాలను దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 13 నుంచి 24 వరకు పుష్కరాలు జరగనుండగా, మండలంలోని అర్జునగుట్ట పుష్కరఘాట్కే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్నది. గత పుష్కరాల్లో నిర్మించిన ఘాట్ వద్ద పేరుకుపోయిన మట్టిని అధికారులు ఇప్పటికే తొలగించారు. అక్కడే తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రూ.70 లక్షల వ్యయంతో పనులు జరుగుతుండగా, రూ.7 లక్షల వ్యయంతో విద్యుత్ లైన్ పనులు, రూ.8.5 లక్షలతో తాగునీరు, ఎండ నుంచి రక్షణకు నీడ , మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులపై దృష్టి పెట్టారు. సుమారుగా 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
గర్మిళ్ల, ఏప్రిల్ 11: ప్రాణహిత పుష్కరాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 24 వరకు మంచిర్యాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల నుంచి అర్జునగుట్ట, సిరోంచ వరకు రూ.120, చెన్నూరు నుంచి అర్జునగుట్ట, సిరోంచకు రూ.55 చార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. మంచిర్యాల, చెన్నూ ర్ నుంచి కాళేశ్వరం వరకు అదనపు బస్సులు నడుస్తాయని, ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
వేమనపల్లి, ఏప్రిల్ 11 : ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జడ్పీ సీఈవో నరేందర్ పిలుపునిచ్చారు. మండలంలోని ప్రాణహిత నది పుష్కర ఘాట్ వద్ద జడ్పీటీసీ స్వర్ణలత, ఎంపీటీసీ సంతోష్‌కుమార్ సొంత ఖర్చులతో ముద్రించిన పుష్కరాల ప్రాముఖ్యత తెలిపే పోస్టర్లను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ మాట్లాడుతూ భక్తుల కోసం 12 రోజుల పాటు ప్రాణహిత నది ఒడ్డున అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో లక్ష్మయ్య, , పీఏసీఎస్ చైర్మన్ గూడ కిషన్‌రావు, సర్పంచ్ గాలి మధు పాల్గొన్నారు.
కౌటాల, ఏప్రిల్ 11 : పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని కాగజ్‌నగర్ డీఎల్పీవో సురేశ్ బాబు సూచించారు. మండలంలోని తుమ్మిడిహట్టి ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద పనులను ఆయా శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. నదిలో లోతుగా ఉన్న ప్రాంతానికి భక్తులు వెళ్లకుండా వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. భక్తులు ఒకేసారి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కౌటాల సీఐ స్వామి, పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా, ఎస్ఐ మనోహర్, ఎంపీడీవో నజ్రుల్లాఖాన్ ఎంపీవో శ్రీధర్ రాజు, ఆర్అండ్బీ ఏఈ రవికిరణ్ ఉన్నారు.