మన పురాణాలు, ఇతిహాసాలు నరసింహస్వామి అవతారాన్ని పలు విధాలుగా కీర్తించాయి. వైదిక విజ్ఞాన కల్పవృక్షంగా పేరున్న శ్రీమద్భాగవతం దేవాది దేవుడైన శ్రీహరి దివ్యలీలలను మహోన్నతంగా వర్ణించింది. భాగవతం ఏడో స్కందంలో భక్తుడి మాటకు కట్టుబడి శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా ఆవిర్భవించిన ఘట్టం అద్భుతం. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు శ్రీ హరి నరకేసరిగా అవతరించాడు. పరమపావనమైన ఈ తిథిని నరసింహ జయంతిగా చేసుకోవడం సంప్రదాయం.
ధర్మానికి కష్టం వచ్చినప్పుడు తాను వస్తానని ప్రకటించాడు శ్రీమహావిష్ణువు. భరించేంత వరకూ ఆదమరిచే ఉంటాడు. కట్టు దాటితే.. ఆయన కూడా పట్టుదలకు పోతాడు అని నిరూపిస్తుంది నరసింహస్వామి అవతారం. సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఏకకాలంలో విష్ణువుగా, నరసింహుడిగా ఉండగలడు. వాస్తవానికి, ఆధ్యాత్మిక లోకంలోని అనంతకోటి వైకుంఠాల్లో ఒకానొక వైకుంఠపురంలో భగవంతుడు శాశ్వతంగా నరసింహస్వామిగా కొలువుదీరి ఉంటాడన్నది భక్తుల విశ్వాసం! తన పరమభక్తుడు, సేవకుడు అయిన ప్రహ్లాదుడి మాటను నిజం చేయడానికి, ఇంకా చెప్పాలంటే భగవంతుడు సర్వవ్యాప్తుడు అని నిరూపించడానికి నరకేసరి అవతారం మంచి ఉదా హరణ. ఎక్కడో ఉన్నవాడు అంతలోనే హిరణ్యకశిపుడి సభా మందిరంలోని ఒక స్తంభం నుంచి ఆవిర్భవించడం చూసేవారికి వింతేమో కానీ, అంతటా ఉన్న ఆయనకు లీల కాదు.
మత్స్య, కూర్మ, వరాహ రూపాలు దాల్చి అవనిని ఉద్ధరించిన దేవదేవుడు కనీవినీ ఎరుగని రీతిలో నరమృగ శరీరాన్ని దాల్చడం భగవత్ భక్తులకు ఆశ్చర్యం కానీ, స్వామికి కాదు! ఆ భగవత్ తత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాడు ప్రహ్లాదుడు. తాను నమ్మిన దైవం సృష్టిలో అణువణువునా ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడు కూడా! అందుకే, తండ్రి ‘ఏడిరా నీ శ్రీహరి.
ఈ స్తంభంలో చూపగలవా?’ అని గద్దించి ప్రశ్నించినప్పుడు.. తొట్రుపాటుకు గురికాకుండా, ‘సందేహమే లేద’న్నాడు. గదా ఘాతంతో స్తంభాన్ని కూల్చాడు హిరణ్యకశిపుడు. భీకర రూపంతో నరసింహస్వామి అవతరించాడు. స్తంభోద్భవుడైన ఆ నరసింహుడు అంత ఆవేశంలోనూ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను నిష్ఫలం చేయలేదు. ఆయనిచ్చిన వరాల్లో లేని రూపాన్ని పొందాడు. తన తెలివితేటలతో మృత్యువును జయించాలని తలచిన రాక్షసుడి ఎదుట మృత్యువై నిలిచాడు. భగవంతుడిని ఎందులోనూ ఎవరూ జయించలేరు. సర్వోన్నతుడనే మాటకు అర్థమదే! షరతులకు లోబడి హిరణ్యకశిపుడిని సంహరించాడు శ్రీహరి.
అవతార లక్ష్యం నెరవేరింది. కానీ, ఆయన ఆవేశం మాత్రం చల్లారలేదు. ఉగ్ర నరసింహుడి ఆగ్రహావేశాలకు ముల్లోకాలూ భీతిల్లాయి. స్వామిని శాంతింపజేయాల్సిందిగా సకల దేవతలూ లక్ష్మీదేవిని కోరారు. ఇదివరకు ఎన్నడూ అలాంటి రూపం చూడని శ్రీమహాలక్ష్మి సైతం స్వామి చెంతకు వెళ్లడానికి శంకించింది. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు అందుకు గల కారణాన్ని చెబుతూ.. ‘భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలు, శరీరాకృతులు కలవాడు. (అద్వైతం అచ్యుతమ్ అనాదిమ్ అనంత రూపమ్). ఈ దివ్య రూపాలన్నీ వైకుంఠంలో ఉన్నవే! అయినా, సకల సౌభాగ్యాలకు ఆదిదేవి అయిన లక్ష్మీదేవి సైతం స్వామి వారి లీలా శక్తి ప్రభావంతో అపూర్వమైన నరసింహ రూపాన్ని ఊహించలేకపోయింది’ అని వివరించారు.
సాక్షాత్తూ లక్ష్మీదేవి దర్శించడానికే దుర్లభమైన ఆ దివ్యరూపాన్ని మనమెలా దర్శించగలం? భగవంతుడు కరుణాసాగరుడు. మానవ మాత్రులను అనుగ్రహించడానికి వీలుగా అర్చావతార మూర్తిగా గుళ్లలో వెలుస్తాడు. ఆగమ ఉపచారాలతో శాస్ర్తోక్తంగా స్వామివారిని ప్రతిష్ఠించిన నరసింహస్వామి దేవాలయాలలోని మూర్తికి, వైకుంఠంలో ఉన్న నరసింహస్వామికి భేదం లేదు. కోవెలలో వెలసిన స్వామిని చూడటం వైకుంఠ ఆలయంలోని ప్రహ్లాద వరదుడిని స్వయంగా దర్శించడమే అవుతుంది.
…?శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభు 9396956984