మానవుడు ఎంతటి మహనీయుడో, తప్పులు చేసి అంతటి బలహీనుడైపోతాడు కూడా. ఆ బలహీనత నుంచి మళ్లీ కోలుకోవాలి. తిరిగి శక్తిని పుంజుకోవాలి. ఇక్కడే ప్రతి మనిషీ తన మతాన్ని, దైవశక్తినీ ఆశ్రయిస్తాడు. ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కో మతం ఒక్కో రకమైన నియమాలు సూచిస్తున్నది. క్రైస్తవ సమాజం నలభైరోజులపాటు క్రీస్తుకు శిలువ వేసిన సంఘటనలు ధ్యానించుకొంటుంది. శుభ శుక్రవారానికి కచ్చితంగా నలభై రోజుల ముందు నుంచే ఈ నియమాలు పాటిస్తారు.
ప్రభువు మరణానికి సంబంధించి ఆయన ప్రజల కోసం పడిన పాట్లు ధ్యానించుకుంటారు. ఈ నేపథ్యంలో తాము చేసిన తప్పులు, పాపాలను తలుచుకుంటారు. అంటే అబద్ధాలు ఆడటం దగ్గర నుంచి ఇతరుల్ని మోసం చేయడం, హింసించడం, ద్వేషించడం, సోమరితనానికి అలవాటు పడి ఇతరుల శ్రమను దోచుకోవడం లాంటి దుష్కార్యాలను సంస్కరించుకుంటారు.
ఇలాంటి పనులు ఇక మీదట చేయకూడదని మనసు మార్చుకొనే ప్రయత్నం చేస్తారు. తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రభువు బోధనలను స్మరించుకుంటారు. ఇందుకోసం ఈ నలభై రోజులను ఆధ్యాత్మికంగా గడిపే ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ సమాజం ఈ నలభై రోజులను పశ్చాత్తాప శ్రమ దినాలుగా పేర్కొన్నది. ఈ కాలంలో క్రీస్తుకు దగ్గర కావడానికి కొంత శ్రమపూరిత జీవన విధానంతో, చిత్తశుద్ధితో పాటించి తీరాలని నిర్ణయించుకొంటారు. ముఖ్యంగా విలాసవంతమైన ఆహారపానీయాలకు దూరంగా ఉంటారు. సుఖసౌఖ్య భోగాల్ని తగ్గించుకుంటారు. త్యాగమయ జీవనాన్ని కొనసాగిస్తారు. ఉపవాసాలు ఆచరిస్తారు, ఉపదేశాలను వింటారు. జీవన విలువ తెలుసుకొని, జీవిత పరమార్థం సాధించుకోడానికి ప్రయత్నిస్తారు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024