భక్తులంతా అంగరంగ వైభవంగా జరుపుకొనే ఒక మహోత్తర వేడుక జగన్నాథ రథోత్సవం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ప్రతిరూపమైన శ్రీ జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్రలతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే దివ్య సందర్భమిది. జగన్నాథుని రథోత్సవం జనన మరణ చక్రానికి అడ్డువేసి, మోక్షమార్గాన్ని సులభంగా అనుగ్రహించ గలదని పలు శాస్ర్తాలు ఘోషిస్తున్నాయి.
జగన్నాథ రథయాత్ర అనేది ఒడిశాలోని పూరీలో ఉన్న అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుని ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ. ఇది ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. భగవంతుడిని ఆలయంలో దర్శించలేని భక్తుల కోసం, జగన్నాథుడే స్వయంగా రథంపై కదిలి వచ్చి దర్శనభాగ్యం కల్పిస్తారు, అందుకే ఆయన్ను ‘పతిత పావనుడు‘ అని పిలుస్తారు. రథంపై కొలువై ఉన్న జగన్నాథ స్వామిని దర్శించినవారు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి.
ఈ మూర్తులు అసంపూర్ణ కరచరణాలతో ప్రత్యేక రూపాల్లో దర్శనమివ్వడం వెనుక ఒక లీల ఉంది. కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సమయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర తమ బాల్యలీలలను రోహిణీ మాత నుంచి విన్నప్పుడు, వారు పరవశించిపోయి వారి దేహాలు విశాలమైన కళ్లతో, లోపలికి చొచ్చుకుపోయిన కరచరణాలతో రూపాంతరం చెందాయి. ఇది వ్రజవాసుల మాధుర్య ప్రేమభావనలకు ప్రతిరూపం. రథయాత్ర సమయంలో రథాన్ని తాడు పట్టుకుని లాగడం, స్వామిని దర్శించడం, హారతులు ఇవ్వడం, నృత్య సంకీర్తనలు చేయడం, రథమార్గంలో ముగ్గులు వేయడం, ప్రసాదాలు నివేదించడం వంటి సేవలు భక్తులు చేయవచ్చు. ఈ సేవలు భక్తులను ఆధ్యాత్మికంగా మరింత పురోగమింపజేస్తాయి.
ఈ రథయాత్ర పూరీ ప్రధాన ఆలయం నుండి గుండీచ ఆలయం వరకు కొనసాగుతుంది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రమ్మలు తొమ్మిది రోజుల పాటు గుండీచ మందిరంలో బసచేస్తారు. రథయాత్ర ఐదవ రోజున ‘హేరా పంచమి’ ఉత్సవం జరుగుతుంది, ఈ రోజు లక్ష్మీదేవి గుండీచ మందిరానికి వెళ్లి, స్వామిని తిరిగి రమ్మని కోపంగా వెనక్కి వస్తుంది. రథయాత్ర చివరగా స్వామివారు తమ మందిరాన్ని చేరుకొని బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చే ‘సోనాబేష’ ఉత్సవంతో ముగుస్తుంది.
హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి కృషి ఫలితంగా జగన్నాథ రథయాత్ర ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ఖండాలలో, ప్రతి ప్రఖ్యాత నగర వీధుల్లో నిర్వహించబడుతోంది. 1967లో అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ రథయాత్రను నిర్వహించారు. ఈ ఉత్సవం కుల, మత, వర్గ భేదం లేకుండా ప్రతిఒక్కరికీ భగవంతుడిని సేవించే
అవకాశాన్ని అందిస్తుంది. ఆలయ ప్రవేశం లేనివారు సైతం రథంపై స్వామిని దర్శించవచ్చు. ప్రజలంతా ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే‘ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ రథయాత్రలు జగన్నాథుని నామాన్ని, ప్రేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తున్నాయి.
చివరగా, ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే‘ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఈ ఉత్సవంలో పాల్గొనడం ద్వారా మనం భగవంతుని కృపను పొంది భౌతిక అస్తిత్వాన్ని అధిగమించవచ్చు. ఇది మానవ దేహంలో ఉన్న జీవునికి నిజమైన జైత్రయాత్ర. రండి! ఈ దివ్య రథయాత్రలో మనం కూడా ప్రత్యక్షంగా పాల్గొని, ఆ స్వామిని సేవించడంలో గల నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదిద్దాం. హరే కృష్ణ!
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 93969 56984