ఇస్లాంలో ఖుర్బానీ (త్యాగం), బలి దానాల భావన అత్యంత ఉన్నతమైనది. ఈదుల్ అజ్హాను ఖుర్బానీ పండుగ అని కూడా పిలుస్తారు. హజ్రత్ ఇబ్రహీం (అ.స) అసాధారణ త్యాగాలను ఈ పండుగ గుర్తుచేస్తుంది. ‘మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు’ అని త్యాగం విలువలను అల్లాహ్ ఖురాన్లో (3: 92) వివరించారు. త్యాగనిరతి ఎంత ఎక్కువగా ఉంటే, సత్కార్య ప్రమాణం అంత ఎక్కువగా ఉంటుంది. హజ్రత్ ఇబ్రహీం (అ.స)కు అల్లాహ్ ప్రసన్నత కోసం చూపిన గొప్ప త్యాగనిరతి అల్లాహ్ పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ వల్లనే జనించింది. ‘ఆయన నాకు మార్గం చూపుతున్నాడు.
నా ఆకలిని తీర్చి నా రోగాలను నయం చేస్తున్నాడు. ఆయనే మృత్యువును కలిగించి మళ్లీ జీవితాన్ని అనుగ్రహిస్తాడు’ అని హజ్రత్ ఇబ్రహీం (అ.స) అన్నారు. దేవుడు ఒకే ఒక్కడనే ఏకదైవారాధన సందేశాన్ని ప్రజలకు అందించడానికి హజ్రత్ ఇబ్రహీం (అ.స) తన జీవితాన్ని అంకితం చేశారు. సమాజం వ్యతిరేకించినా, రాజు (నమ్రూద్) మరణ శిక్ష విధించినా ఆయన తన లక్ష్యాన్ని వీడలేదు. తన భార్యను, పసిబిడ్డను చుక్క నీరు లేని నిర్జన లోయలో విడిచి పెట్టాల్సి వచ్చినా చలించలేదు. కన్న కొడుకుని బలి ఇవ్వమని ఆదేశం వచ్చినా వెనుకాడలేదు. ఈ మూడు పరీక్షల్లో విజయం సాధించిన తర్వాతే, అల్లాహ్ ఆయన్ను మానవాళికి నాయకుడిగా చేశాడు. అల్లాహ్ ప్రేమ కోసం సమస్తాన్నీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని హజ్రత్ ఇబ్రహీం (అ.స) జీవితం మనకు తెలియజేస్తుంది