ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, రచయితలు తెలంగాణ వ్యావహారిక భాషకు ప్రాధాన్యమిస్తూ విస్తృతంగా రచనలు చేయడం చూశాం. తెలంగాణ తెలుగు భాషలో రాయడం, చదువడం అనివార్యంగా మారిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అప్పటినుంచి పునికి పుచ్చుకున్నది. కానీ, ఆ భాషకు ప్రామాణికతను, సూత్రబద్ధతను వృద్ధి చేయడంలో సరైన తెలంగాణ భాషా పరిశోధన జరగలేదనే చెప్పాలి.
తెలంగాణలో ఆయా రంగాల్లో పరిశోధనలు చేసి తమదైన ముద్రవేసిన వారున్నప్పటికీ, ప్రత్యేకంగా తెలంగాణ భాషపై పరిశోధన చేసినవారు ఎవరున్నారనే ప్రశ్న వేసుకుంటే.. ఎటుచూసినా డాక్టర్ నలిమెల భాస్కర్ మాత్రమే కన్పిస్తున్నారు. వీరికన్న ముందు ‘తెలంగాణ జాతీయాలు’ పేరుతో వేముల పెరుమాళ్లు తెలంగాణ భాషకు పట్టం కట్టేందుకుపడ్డ ఆరాటాన్ని చూశాం.
ఈ గ్రంథం భాషా శాస్త్రంలో భాగంగా చూపబడినా, ఇది పూర్తిగా తెలంగాణ భాషా తీరుతెన్నులను తెలిపే పుస్తకం కాదు. జాతీయాలకే పరిమితమైనది. అయినప్పటికీ ఇదెంతో ప్రామాణికమైనది, ఉపయుక్తమైనది కూడా.
17 భాషలు మాట్లాడగలిగే పీవీ నరసింహారావు కూడా కొంతమేరకు ‘గొల్ల రామవ్వ’ కథలో తెలంగాణ భాషను ఎత్తి పెట్టుకున్న సందర్భం చూడవచ్చు. కానీ, ప్రత్యేకంగా తెలంగాణ భాషపై పరిశోధనలు మాత్రం చేయలేదు. పీవీ తర్వాత 14 భాషలపై పట్టు సాధించి, తెలంగాణ భాషపై విశేషమైన పరిశోధన చేసి, తెలంగాణ భాషకు పట్టాభిషేకం చేసింది ఒక్క నలిమెల భాస్కర్ మాత్రమే.
ఈయనకు తెలంగాణ భాష అంటే ఎందుకో ఎనలేని మక్కువ. ఈ విషయం ఆయన పుస్తకాలను నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది. కవిగా, రచయితగా, భాషా శాస్త్రవేత్తగా, ఉపన్యాసకుడిగా నలిమెల భాస్కర్ తెలంగాణ భాషాభివృద్ధికి విస్తృత పరిధిని ఏర్పాటు చేసుకున్న తీరు కనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ‘ఏది అసలైన తెలుగు’ అనే వాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ భాషే అసలైన తెలుగు భాష అని నలిమెల భాస్కర్ హేతుబద్ధంగా, తార్కికంగా వాదించారు. ఆయన పరిశీలనలో తెలుగుతో తెలంగాణ తెలుగును పోల్చితే తెలంగాణ భాషలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి. తెలంగాణ తెలుగు కావ్య భాషకు, ఇటు గ్రాంథిక భాషకు చాలా దగ్గరగా ఉన్నదని ఆయన అంటారు. తెలంగాణ తెలుగు అచ్చతెలుగు పదాలతో మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుందంటారు. ఇక్కడితో ఆగిపోకుండా ద్రవిడ భాషా పదాలు అనేకం తెలంగాణ తెలుగులో ఇప్పటికీ కనిపిస్తాయని, చాలా అద్భుతమైన జాతీయాలు, సామెతలతో తెలుగు భాష సజీవంగా తెలంగాణలో ఉన్నదని నలిమెల అంటారు. అంతేకాదు, జానపద గేయాలు తెలంగాణ తెలుగులోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా ఆయన గుర్తించారు. ఇదే విషయాన్ని డాక్టర్ పీవీ పరబ్రహ్మశాస్త్రి ‘తెలుగు లిపి ఆవిర్భావ వికాసాలు’ గ్రంథంలో (పుట-36) ‘తెలుగు-తెనుగు’ పదాలను దేశ జాతి వాచకాలుగా ప్రస్తావించారు. తెలింగాణ (తెలింగ+ఆణి)లోని ‘ఆణ’ అంటే భూమి, దేశం అని, తెలింగాణ అంటే తెలుగు మాట్లాడేవారు నివసించే భూమి అనే అర్థం వస్తుందని చెప్పారు. ఆయన దృష్టిలో తెలంగాణ తెలుగే అసలైన తెలుగని స్ఫురిస్తుంది. ఇదే అంశాన్ని నలిమెల భాస్కర్ సూత్రబద్ధంగా
వివరించారు.
అన్న కొమర్రాజు వేంకట లక్ష్మణరావు వ్యాసాలను మనం నిశితంగా పరిశీలిస్తే నలిమెల భాస్కర్ వాదనలు వాస్తవమనే నిర్ధారణకు వస్తాం.
నాడు తెలంగాణ సాహిత్యానికి సురవరం ప్రతాపరెడ్డి వెన్నుదన్నుగా నిలబడితే నేడు నలిమెల భాస్కర్ ‘అసలు మీది భాషే కాద’న్న వాదానికి వాతపెడుతూ తెలంగాణ భాషే అసలైన తెలుగు భాష అని నిరూపిస్తూ తెలంగాణ భాషకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అందుకు తెలంగాణ భాషపై ఆయన చేసిన పరిశోధన, వెలువరించిన గ్రంథాలే నిదర్శనం. పది తెలంగాణ భాష గ్రంథాలకు తన పరిశోధనతో పురుడుపోశారు. దీనిలో ప్రధానంగా ‘తెలంగాణ పదకోశం’ అనే తెలంగాణ మాండలిక నిఘంటువు ఒకటి. దాదాపు ఏడు వేల తెలంగాణ పదాలతో వెలువడిన ఈ నిఘంటువు తెలంగాణలో మొట్టమొదటి పదకోశం. ఆచార్య రవ్వా శ్రీహరి ఈ పుస్తకానికి ‘అభినందనం’ పేరుతో ముందుమాట రాస్తూ ఒక మాట అన్నారు.
అదేమిటంటే.. ‘ప్రాచీన నిఘంటుకారులు ప్రధానంగా లిఖిత వాఙ్మయంలోని పదజాలాన్ని మాత్రమే నిఘంటువులోకి చేర్చడానికి ప్రయత్నించారు. మాండలికాలను గాని, జన వ్యవహారంలోని పదాలను గాని నిఘంటువులలో చేర్చలేదు. దీనివల్ల జన వ్యవహారంలోని అనేక పదాల స్వరూపం గాని, వాటి అర్థాలు గాని జిజ్ఞాసులకు తెలియడానికి అవకాశం లేదు. నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశం వంటి నిఘంటువులు ఈ లోపాన్ని తీరుస్తాయనడంలో సందేహం లేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలు నలిమెల భాస్కర్ తెలంగాణ భాషాభివృద్ధికి చేస్తున్న కృషి గురించి చెప్పుకోడానికి. అన్నం ఉడికిందో, లేదో అన్నది ఒక మెతుకును పిసికి చూస్తాం. ఆ మెతుకే ‘తెలంగాణ పదకోశం’. ఈ పదకోశమే నలిమెల భాస్కర్ తెలంగాణకు జీవం పోసే వివరణాత్మక దృష్టి కోణం.
నలిమెల ఎంత నిఖార్సైన తెలంగాణ భాషా పరిశోధకుడో ఒక ఉదాహరణ చెప్పుకొందాం. ‘తెలంగాణలో లయబద్ధమైన భాష ఉన్నది. నాదాత్మకమైన మాట ఉన్నది. మాట మాట్లాడితే చాలు ఏదో ఒక సంగీతం జాలువారుతున్నది’ అని అంటారు. అది ఎట్లనో కూడా వివరిస్తారు.
ఇది నిజమే కదా మన తెలంగాణలో ఈ పదాల అల్లిక, వాటి గుబాళింపు మనకు ఎర్కనే కదా! ఇంకా దీన్ని సమర్థిస్తూ.. ‘కోతైన కొమ్మతప్పి దుంకదు’ అన్న రహస్యం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసంటారు. పాట ఎంత ముఖ్యమో తెలంగాణ వాసులకు మాట కూడా అంతే ముఖ్యమని అంటారు. ‘లయబద్ధంగా మాట్లాడుకునే మాట తీరు తెలంగాణ పాటకు ఎక్కడ లేని బలాన్నిచ్చింది’ అని అంటారు. నిజమే తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక పాటలు మాటలకు ప్రాణం పోసి, చైతన్యాన్ని రగిలించాయి. మాటే తెలంగాణలో ఎట్లా నాదమైందో కూడా ఉదాహరణలు ఇచ్చారు. తెలంగాణ భాషను నాదమయం చేయడంలో పూర్ణానుసారం పాత్ర కూడా చాలా గొప్పదంటారు. అంటే నిండు సున్న పాత్ర తెలంగాణ మాండలికంలో ఎంత ముఖ్య భూమికను పోషిస్తుందో మొట్టమొదట సోదాహరణంగా వివరించారు.
ఇట్లా అనేక పదాలను దబ్బుడ్కంతోని కుట్టి తెలంగాణ గోనె సంచిలేసి కట్టి తెలంగాణ ప్రజల కోసం దాచి పెట్టిన్రు. ఆ మూటనిప్పి చారిత్రక, తులనాత్మక దృష్టికోణంతో పరిశీలిస్తే తెలంగాణ మాగాణంలో భాషా ఆవశ్యకత నేటి సమాజానికి అవగతమవుతుంది. పరిశోధనాంశంగా నిలుస్తుంది. నలిమెల భాస్కర్ 1976లో తెలంగాణ భాషలో రాసిన ‘రాతి గుండెలు’ మొదలుకొని నేటి ‘చెలిమెలు’ పుస్తకం(2025) వరకు భాష ప్రధానంగా జీవిస్తున్న నిఖార్సైన తెలంగాణ మట్టి మనిషి. తెలంగాణ ప్రాంతానికి సాహిత్యపరంగా ఎదురైన సవాళ్లను ఎప్పటికప్పుడు తేటతెల్లం చేస్తూ భాషకు ప్రామాణికతను, సూత్రబద్ధతను కల్పిస్తున్నారు.
ఉదాహరణకు తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో బమ్మెర పోతన కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతానికి చెందినవారనే వాదన బలంగా వినిపిస్తున్న సమయంలో ‘పోతన ఆంధ్ర మహా భాగవతం’, ఆయన రచించిన ఎనిమిది స్కంధాలను పరిశీలించి ‘తెలంగాణ పద ప్రయోగ సూచిక’ను తయారు చేశారు. అది తెలంగాణ సమాజానికి బమ్మెర పోతనను మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ఆది కవి, తెలుగు ఆదికవిగా పేర్కొనదగిన పాల్కురికి సోమనాథుని బసవపురాణానికి ‘పద ప్రయోగ సూచిక’ సిద్ధం చేసి సాహిత్య సమాజానికి బసవపురాణాన్ని, సోమనను మరింత చేరువ చేశారు.
అని అంటారు. ‘తిట్లకు కూడా నాదమే ఆత్మ’ అని అంటారు. ఉదాహరణకు ‘తల్లాలిని తిట్టినా తాళం తప్పొద్దురా’ అన్న సామెత గుర్తుకుతెస్తారు.
‘కాళ్లల్ల కట్టెలు పెట్టుడు’ పదాన్ని రెండు రాష్ర్టాల్లో ఏ విధంగా వాడుతారో చాలా స్పష్టంగా వివరించారు. ‘వాడు నన్ను అడ్డగించాడు’, ‘వాడు నన్ను అడ్డుకున్నాడు’, ‘అంత మంచి పనికి అడ్డంకులు కల్పించవద్దు’, ‘అసలు నీ పని ఎప్పుడూ అడ్డు పుల్లలు వేయడమేనా’ అనే పదాలను గమనిస్తే ప్రామాణిక భాషలోని ఈ ‘అడ్డంకులు పెట్టు’ అనేది తెలంగాణలోని ‘కాళ్లల్లా కట్టెలు పెట్టు’ అనేది రెండు సమానార్థకాలు. ఈ అడ్డుపడు అనేది ఒక క్రియ. దీనికి నిఘంటువులో అర్థం ‘అడ్డం వచ్చు’ అని అర్థం. కానీ తెలంగాణలో మాత్రం ‘అడ్డపడు’ అంటే సహాయపడు, ఆపన్నహస్తం అందించు మొదలైన అర్థాలున్నాయని అంటారు నలిమెల.
‘నాకు ఇంత పెద్ద ఆపతి వచ్చింది. అయినా గుండె ధైర్యం అసలు చెడలేదు. ఆఖరికి ఆ దేవుడన్న అడ్డుపడకపోతాడా..! అన్న ఆశతోని బతుకుతున్న’. ఇక్కడ ‘అడ్డుపడు’కు తెలంగాణలో ‘రక్షించడం, కాపాడటం’ అని అర్థమని నలిమెల అంటారు. తెలంగాణ మాండలికానికి, ఇతర మాండలిక పదాలకున్న వ్యత్యాసం, సారూప్యతలను స్పష్టంగా వివరించారు నలిమెల. ఇది ఆయన నిశిత దృష్టికి, లోతైన పరిశీలనకు నిదర్శనం.
వేముల పెరుమాళ్లు ‘తెలంగాణ జాతీయాలు’, నలిమెల భాస్కర్ ‘తెలంగాణ భాషా శాస్త్ర గ్రంథాలు’ (పదికి పైగా) ప్రస్తుతం మన ముందు సవాళ్లనుంచాయి. తెలంగాణ భాషా శాస్ర్తానికి కావలసినంత ముడిసరుకు ఈ ఉద్యమ నేల మీద ఉందనే వాస్తవాన్ని ఎరుకజేశాయి. ఈ రెండు పరిశోధనాత్మక గ్రంథాలు ఇప్పుడు తెలంగాణ సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ మాండలికానికి తలమానికంగా నిలుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.