Sri Ramanavami ( శ్రీరామనవమి స్పెషల్ )| ఆదిదంపతుల తర్వాత అంతటి ఆదర్శ దాంపత్యం సీతారాములది. లోకకల్యాణార్థం ఒక్కటైన జంట ఇది. వారి వివాహబంధం ఆత్మీయ, అనురాగాల మేళవింపు. రాజధర్మం కోసం సీతను వీడిన రాముడే.. అపహరణకు గురైన తన భార్య కోసం భారీ యుద్ధం చేశాడు. భార్యపై ఆయనకున్న మమకారం, భర్తపై ఆమెకున్న నమ్మకం ఆదికావ్యమైంది. అరమరికల్లేని ఆ దంపతుల సంసార నిఘంటువులోని ఈ సందర్భాలు ఈ తరం ఆలుమగలకు ఆదర్శం.
రామ పట్టాభిషేకానికి దశరథుడు నిర్ణయించిన ముహూర్తం దగ్గరపడుతున్నది. సీతమ్మ తన అంతఃపురంలో సంతోషంగా ఉంది. ఇంతలో రాముడు వచ్చాడు. ఆయన ముఖంలో ఏ ఆనందమూ లేదు. వెంట ఎవరూ రాలేదు. పట్టాభిరాముడికి ఛత్రం లేదు. వందిమాగధుల స్తోత్రాలు లేవు. ఏదో నిర్లిప్త వాతావరణం. సీతమ్మ దగ్గరికి రావడానికి ముందే.. రాముడు తన తల్లి కౌసల్య మందిరానికి వెళ్లాడు. పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్తున్నట్టు చెప్పాడు. బాధతో విలవిలలాడిన తల్లిని ఊరడించాడు. పద్నాలుగేండ్లు ఇట్టే గడిచిపోతాయని ధైర్యం చెప్పాడు. చిరునవ్వుతో తల్లిని అనునయిస్తూ.. ఆమెను శాంతపరిచాడు. సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖంలో ఏదో వెలితి. జరిగినదంతా చెప్పాడు. తనను తాను నిగ్రహించుకోలేపోయాడు. ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యాడు. అడవులకు పోతున్నందుకు కాదా బాధ! సీతను పద్నాలుగేండ్లు విడిచిపెట్టాల్సి వస్తున్నదని. ‘నువ్వు జాగ్రత్త! నీ జ్ఞాపకాలు నన్ను పద్నాలుగేండ్లు నిలువనిస్తాయా?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అప్పుడు సీతమ్మ ‘నన్ను వదిలి ఒంటరిగా వెళ్తానంటారేమిటి? మీరెక్కడో, నేనూ అక్కడే!’ అంది.
వారించాడు రాముడు. వనవాసం అంటే మాటలు కాదన్నాడు. క్రూరమృగాలు ఉంటాయన్నాడు. రాక్షసుల ముప్పు పొంచి ఉంటుందన్నాడు.
భర్తను అనుగమించడమే తన ధర్మం అంటుంది సీత. అది పురమైనా, వనమైనా తనకు ఒకటే అని నిశ్చయంగా చెబుతుంది.
‘పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా॥’- సుఖదుఃఖాల్లో, లాభనష్టాల్లో భర్తను నీడలా అనుసరించమని వివాహ సమయంలో తండ్రి జనకుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది సీత. అయోధ్యలో ముగ్గురు అత్తలు, ముగ్గురు తోడికోడళ్ల మధ్య ప్రశాంతంగా జీవించే అవకాశం ఉన్నా.. రాముడి సన్నిధిలో ఉండటం కన్నా వేరే సుఖం లేదని తలచింది. భర్త వెంట అడవికి నడిచింది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఎప్పుడూ తోడుగా ఉండాలని ఈ సందర్భం చాటుతుంది.
వనవాస సమయంలో సీతమ్మ ఒడిలోనే రాముడు సేదతీరేవాడు. ‘నీవు తోడు రాకపోతే.. ఈ అరణ్యవాసం దుర్భరంగా ఉండేది సీతా!’ అని ఎప్పుడూ అనేవాడు రాముడు. ఆ మాటలకు సీతమ్మ సిగ్గుపడుతూ కాలివేళ్లతో ముగ్గులు వేసేది. సజావుగా సాగిపోతున్న వనవాసంలో ఓ అలజడి. రాక్షసులు తమకు తపోభంగం కలిగిస్తున్నారంటూ కొందరు మునులు వచ్చి రాముడితో తమ బాధలు చెప్పు కొన్నారు. రాముడు వారికి అభయమిస్తాడు. సీత రాముణ్ని వారించడానికి ప్రయత్నిస్తుంది. ‘స్వామీ! మనిషి మూడు రకాల దుర్వ్యసనాల్లో పడతాడు. ఒకటి అబద్ధం పలకడం. నీవు కలలో కూడా అబద్ధం చెప్పవని నాకు తెలుసు. రెండోది పరస్త్రీల పట్ల వ్యామోహం. అది నీకు లేదు. మూడోది ఏ శత్రుత్వమూ లేకుండా కయ్యానికి కాలుదువ్వడం. రాక్షసులు నీకు ఏ కీడు తలపెట్టలేదు కదా! మరి ఎందుకు వారితో వైరం కొని తెచ్చుకుంటావు’ అంటుంది. అప్పుడు రాముడు ‘తపస్సు చేసుకుంటున్న రుషులను రాక్షసుల నుంచి కాపాడటం క్షత్రియ ధర్మం’ అని సీతమ్మ మాటను సున్నితంగా తిరస్కరిస్తాడు.
పైన పేర్కొన్న సందర్భం సీతారాముల మధ్య ఉన్న అవగాహనను తెలుపుతుంది. లోకకల్యాణం కోసం రాముడు రాజధర్మం పాటించినప్పటికీ, సీత మాటకు విలువిచ్చి, తాను ఎందుకు రాక్షసులను సంహరించడానికి వెళ్లాల్సి వస్తున్నదో కూడా చెబుతాడు. భర్త ఏదైనా తలపెడితే భార్య మంచి, చెడులు చెప్పాలి. సాధ్యాసాధ్యాలు పరిశీలించమనాలి. భార్య మాటలను కరాఖండీగా తోసివేయడం భావ్యం కాదు. ఆమె చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని, తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిమాటను ఒకరు వింటే.. ఆ సంసారంలో కష్టాలకు తావుండదు.
“Sri Ramanavami Special | శ్రీ రామతత్వమ్ మనకు ఏం బోధిస్తున్నది?”
“శివుడు- విష్ణువు ఒకటే.. వారిద్దరినీ ఎందుకు కలిపి చూడాలో చెప్పే సందర్భాలివే..”
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?