బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలమ్
(భగవద్గీత 2-50)
‘అర్జునా! ఎవరైతే బుద్ధితో విచారించి, ఫలితాపేక్ష లేకుండా, వివేకంతో కర్మలను ఆచరిస్తాడో.. అతను తన కర్మలకు సంబంధించిన మంచిచెడు ఫలితాలను ఈ జన్మలోనే వదిలేస్తాడు. అందువల్ల నైపుణ్యంతో పనిచేయడం అనేది యోగం’ అంటాడు కృష్ణుడు.
కర్మాచరణకు ప్రేరణ ఆ పనిలో పొందే ఫలితమే కదా.. అప్పుడా పలితాన్ని అపేక్షించకుంటే, పొందకుంటే.. కార్యనిర్వహణపై ఆసక్తిగాని, ప్రేరణగాని ఉత్సాహం గాని రాదు సరికదా.. పని చేయాలనే కోరికే నశిస్తుందన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజానికి ఎవరైనా ఫలితానికి బందీ అయితే తమ కర్తవ్యాన్ని సమత్వ బుద్ధితో నిర్వహించడం కష్టమవుతుంది. ఆశించిన ఫలితం వస్తుందో రాదో అనే భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత పనితనంపై ప్రభావాన్ని చూపుతూ.. గరిష్ఠ నైపుణ్య సామర్థ్యంతో పని చేయలేక పోవచ్చు. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే, మనపని లోని నాణ్యత ఏ మాత్రం తగ్గకపోగా, మరింత ఉన్నత ప్రమాణాలతో కార్య నిర్వహణ సాధ్యపడుతుందంటాడు కృష్ణుడు.
‘కౌశలం’ అంటే పనిలో నిబద్ధతతో కూడిన నేర్పు లేదా నైపుణ్యం. దానినే యోగం అంటుంది గీత. ప్రక్రియ ఆధారంగా చేసే పనిలో ఫలితం ఏదైనా సమానంగా తీసుకోవడమే సమత్వం. ఒక దొంగలో నైపుణ్యం ఉన్నా అది ఆదరణీయమా అంటే.. కాదనే చెప్పాల్సివస్తుంది. నైతిక విలువలు లేని నైపుణ్యాలను గీత ఆదరించదు. సరైన పనిని, సరైన విధానంలో నిర్వహించాలి. దానికి సరైన కారణం ఉండాలి. దానినే కౌశలం అంటారు.
భగవద్గీత బద్ధకస్తుడైన సాధారణ వ్యక్తిని, అసాధారణ కార్యసాధనా దక్షునిగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తుంది. బుద్ధిని ఉపయోగించి, నైపుణ్యంతో పనిచేసే వ్యక్తి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగిస్తూ.. అసాధారణ ఫలితాలను సాధిస్తాడు. కురుక్షేత్ర యుద్ధారంభంలో శ్రీకృష్ణుడి సాయం అపేక్షించి వెళ్లిన దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకోగా, అర్జునుడు వాసుదేవుణ్ని కోరుకున్నాడు. గద్ద తానెంత ఎత్తులో ఉన్నా కింద ఉన్న లక్ష్యంపై దృష్టి చెదరనీయదు. అర్జునుడి వివేచన కృష్ణుడి జ్ఞానాన్ని, వివేచనను కోరుకోగా. దుర్యోధనుడి ఫలితాపేక్ష సంఖ్యాబలానికి మొగ్గుచూపింది.
శత్రువులను జయించి రాజ్యాన్ని పొందాలనే ఫలితాపేక్షతో యుద్ధానికి వచ్చిన అర్జునుడు, ‘నా వాళ్లు’ అనే మమకారంతో స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత, అదే అర్జునుడు… యుద్ధాన్ని కర్తవ్యంగా భావించాడు. అర్జునుడి దృక్పథం మారింది. ధర్మ రక్షణే ప్రధానమని భావించాడు. తన కర్తవ్యాన్ని మమకారాది బంధనాలకు అతీతంగా నిర్వహించడం వల్ల అతని సామర్థ్యం ఇనుమడించింది. దీక్షతో, దక్షతతో మరింత ఉత్సాహంతో పోరాడాడు. దానినే ఫలితాపేక్షలేని నైపుణ్యంగా చెప్పవచ్చు.