తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25న జరగనున్న రథ సప్తమి ( Ratha Saptami ) ని అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ( EO Anil Kumar Singhal ) అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో బుధవారం టీటీడీ అదనపు ఈవో, జిల్లా , టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా , పోలీసు, టీటీడీ అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సదుపాయాలు కల్పించామని వివరించారు.
రథ సప్తమి రోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతకు పెద్ద పీట వేయాలని, టీటీడీ భద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా నిల్వ ఉంచుకోవాలన్నారు.
భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనం ముందు వాహన ప్రాముఖ్యతను తెలియజేసేలా వ్యాఖ్యాతలను నియమించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
రథ సప్తమి సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలనూ , తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేసినట్లు వెల్లడించారు.
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, తిరుపతి కమిషనర్ మౌర్య, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ, టీటీడీ, జిల్లా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.