యతిపతి శుకుడు క్షితిపతి పరీక్షిత్తుతో..
క॥ చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు ముని జన వనచైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్
మహారాజా! మహా విష్ణువు చరిత్రలు మహా విచిత్రాలు. అవి మూడు లోకాలకు (స్థూల, సూక్ష్మ, కారణ దేహాలకు) పరమ పవిత్రాలు. ఆపన్నులై, ఆశ్రయించే అఖిలప్రాణి లోకాన్ని ఆదుకొని ఆర్తిని అంతమొందించే ఆప్తమిత్రాలు-ఆత్మీయ బంధాలు. రుషి ముని సంత మహాత్ముల మనములనే ఉద్యాన వనములకు వసంతాలు. అవి భవ బంధాలనే తీగలను అవలీలగా తెగనరికే లవిత్రాలు (కొడవళ్లు).
విష్ణుదేవుని చరిత్రలు- నామ, రూప, గుణ, ధామ. లీలా విశేషాలు ఎంత అమూల్యములో, ఆస్వాదయోగ్యములో, అప్రతిహత ప్రభావ సంపన్నములో.. సమూలంగా, సరసంగా సాక్షాత్కరింపజేసే ఈ సప్తమ స్కంధానికి, అందునా స్కంధ నాయకుడైన ప్రహ్లాదుని చరిత్రకి, అమూలకమైన పై ‘కందం’ ముఖచిత్రంగా ఎన్ని అందాలను చిందిస్తున్నదో భాగవత రసిక బృందాలకే ఎరుక. ప్రాస స్థానంలో త్రిప్రాసం (మూడక్షరాలు)- చిత్రంబులు, పవిత్రంబులు, లవిత్రంబులు, సన్మిత్రంబులు, చైత్రంబులు, చారిత్రంబులు- ఈ అంత్యప్రాసలు దరువుల లాగా రసజ్ఞుల వీనులకు విందు చేసే పసందైన పొందిక కల కూర్పులు. మన పోతన మధురిమ తీర్పులు!
సర్వజీవ సముదాయానికి సమానహితుడు, సన్నిహితుడు, ఆత్మ స్వరూపుడు అయిన శ్రీహరి సమభావన పట్ల అత్యంత సమంజసమనిపించే సంశయాన్ని వెలిబుచ్చి సమాధానం కోరిన పరీక్షిత్తు పరిప్రశ్నను- ‘నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర’ అంటూ ప్రస్తుతించి, పరమానందమొంది పరమర్షి శుకయోగి ఇలా పలికాడు.. నరనాథా! నీవు నిక్కముగా-నిజంగా చాలా చక్కని గూఢమైన- చిక్కు ప్రశ్ననే సంధించావు. దానికి సరిసమానంగానే సమాధానం కూడా చాలా గాఢంగా- చిక్కగానే ఉంటుంది. అవక్ర విక్రమం గల చక్రధరుని చరిత్రలు చింతనాపరులకు చిత్ర విచిత్రాలు. అవి అడుగడుగునా కడు పవిత్రమైన భక్తుల కథలు, గాథలతో ముడిపడి ఉంటాయి. కీర్తన, ధ్యాన ప్రధానాలైన ఆ కథలు భక్తికి అనుపానాలు, ముక్తికి సోపానాలు. వాటిని వినడం వలన మనస్సులు మాధవుని పాదపద్మాలపై మత్తమధుపాల వలె పాదుకొంటాయి. అవి మునీశ్వరుల భక్తిరస స్నిగ్ధములైన ముగ్ధమనోహర మధుర మంజుల వాగ్విలాస విభూతులకు విశిష్ట నిధానాలు (గనులు). భగవంతుని పట్ల భక్తి ప్రవర్తిల్లి, ప్రవృద్ధమై, ఫలించడానికి అనురక్తితో భక్తుల మాహాత్మ్య శ్రవణమే సులభ సాధనం. మహారాజా! మహాత్ముడైన వ్యాస మహర్షికి ముందుగా వందన మాచరించి, నిస్తరంగ నీరనిధి (అలలు లేని కడలి) వంటి, దుస్తర మాయాపతి అయిన నందనందనుడు శ్రీకృష్ణచంద్రుని ప్రశస్త కృపా విభూతిని విస్తరించి వర్ణిస్తాను.
భగవంతుడి కన్నా భాగవతుడే మిన్న అన్నది భక్తి శాస్త్ర సిద్ధాంతం. తన భక్తుల పట్ల పక్షపాతం చూపడం వాస్తవానికి భగవంతుడి మహిమా విశేషం కాదు. తన యెడల పక్షపాతం పూనే విధంగా వాసుదేవుని వివశునిగా చేయడం దాసుల అశేషమైన భక్తి గరిమా (గొప్పదనం) విశేషం! ‘స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్, నృసింహ మద్భుతం వందే పరమానంద విగ్రహమ్’- తన అనన్య భక్తుడైన ప్రహ్లాదుని యందలి పక్షపాతంచే, తనకు స్వపక్ష (ద్వారపాలకుడు)మైనా దాసునికి విపక్షమైన హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన, ముదావహమైన పరమాద్భుత ఉదారమూర్తిని ధరించి అవతరించిన చిదానంద స్వరూపుడైన నరసింహ దేవునికి సదా వందనమంటూ శ్రీధరస్వామి సప్తమ స్కంధ భాష్య రచనకు ఉత్సహించి ఉపక్రమించాడు. ‘విబుధవరుల వలన విన్నంత..’ అన్న పోతన్న మాట శ్రీధర, వంశీధరుల వంటి ఉన్నతులైన వ్యాఖ్యాతలను ఉద్దేశించి ఉటంకించినదే.
అవనీనాథా! అనంతుని వింత గొలిపే తత్తం ఎంతవారికైనా అంతంత మాత్రంగా అంతుపట్టేది కాదు. అంతేకాదు, నీవన్న మాటలన్నీ త్రిగుణాలకు వశులైన (లొంగిన) వారికి వర్తించేవే కాని గుణాలకు అతీతుడైన అచ్యుత భగవానునికి అన్వయించవు. ఆయన నిర్గుణుడు కాన గుణవికారాలు- పరిణామాలూ లేవు (అవికారాయ శుద్ధాయ). కనుక, రాగద్వేషాలకు ప్రియ, అప్రియాలకు అవకాశమే లేదు (నమే ద్వేష్యోస్తి న ప్రియః-గీత). జీవప్రకృతికి అతీతుడు కాన జన్మబంధాలలో చిక్కడు. కాని, గుణాలకు అతీతుడైనా (నిర్గుణుడైనా) తన మాయాశక్తిచే సగుణుడిలా అనిపిస్తూ తానే ‘బాధ్యబాధకత్వంబులు నొందు’- బాధకులైన దైత్యుల రూపంలోను, బాధితులైన దేవతల రూపంలోను మన దృష్టికి కనిపిస్తున్నాడు. త్రివిక్రముడు త్రిగుణ రహితుడైతే మరి ఈ గుణాలు ఎవరివి? అంటే, సృష్టించబడిన ఈ దేవ, దానవ, యక్ష, రాక్షస, మానవ జాతులవి. అందులో దేవతలది సత్తగుణం, దైత్యులది రజోగుణం కాగా, యక్ష రాక్షసులది తమోగుణం. మానవులది మిశ్రమ మనస్తత్త్వం. ఇదే త్రిసర్గం- త్రిగుణమయ సృష్టి. ఈ గుణాలకు ఒకే కాలంలో హెచ్చుతగ్గులు కలుగవు. పూర్ణచంద్రుని చూసి పారావారం (సముద్రం) ఉప్పొంగునట్లు జీవుల కర్మవిపాక (ఫలానుభవ) కాలాన్ని బట్టి గుణాలకు వృద్ధిక్షయాలు ఏర్పడుతుంటాయి. సృష్టించాలన్న కోరిక కలిగినప్పుడు పరమాత్మ రజో గుణాన్ని, సృష్టిని రక్షించాలనుకున్నప్పుడు సత్త గుణాన్ని, దానిని తుంచివెయ్యాలని తలంచినప్పుడు తమో గుణాన్ని పెంచుకుంటాడు. ఈ సృష్టి, స్థితి, లయాలు ‘కాల’ స్వరూపుడైన ‘తన’లోనే కనిపిస్తూ, కనుమరుగవుతూ ఉంటాయి.
దేవ, దానవ, రాక్షసాదులు తమ-తమ గుణాలకు తగినట్లు పరస్పరం తలపడుతుంటే ఈశ్వరుడు వారి-వారి కాల, కర్మ, స్వభావాలను అనుసరించి వారిని రక్షిస్తూ, శిక్షిస్తూ ఉన్నట్లుగ అగుపిస్తున్నాడు. ఇది ఆయన స్వభావం. ఆయనకు లీల! రాజా! ఇంతకూ భోజనమూ (అన్నము) తానే, భోక్త (అన్నాదుడు, తినువాడు) తానే! అలాగే బాధ్య (బాధితులు), బాధకులు (బాధించువారు)- ఇద్దరూ తానే! శిక్షకుడు తానే, రక్షకుడూ తానే! పిల్లిగా భోక్త, ఎలుకగా భోజనం! ‘సర్వము తాను అయినవాడు’ కదా ఈశ్వరుడు. ఇలా, రెండు విరుద్ధ రూపాలుగా భాసించడం కేవలం ఆయన మాయ. ‘సమత మాధవునిది. మమత, విషమత మాయది’- ఇదే తత్తసారం! దీపం అకర్త (ఏమీ చెయ్యదు). కేవల సాక్షి. కాని, దీపం లేనిదే ఏ పాపకార్యం కాని, పుణ్యకార్యం గాని లేవు కదా! అలాగే భగవంతుడు స్వరూపతః (వాస్తవానికి) నిష్క్రియుడు. మాయాశక్తి వల్లనే ఆయన యందు క్రియ భాసిస్తుంది.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి