‘బాలానాం రోదనం బలం’- పసిపిల్లలకు ఏడుపే ఏడుగడ- అసి (కత్తి) వంటి ఆయుధం. భక్తులకు కూడా రోదనమే ఓదనం- సాదం, ఆహారం! భగవత్ ప్రాప్తికి అమోఘమైన సాధనం! ఆక్రందన (విషాద) యోగం లేనిదే నందనందనుని- గోవిందుని ప్రసాద (అనుగ్రహ) ప్రాప్తి లేదు. ధనంజయుని- అర్జునుని విషాదమే కదా ‘గీతా’ ప్రాసాదానికి పటిష్ఠమైన పునాది! దైవం కోసం, ధర్మం కోసం ఏడిస్తే ఆ ఏడుపు యోగం అవుతుంది. ప్రసవ వేదన లేక పుత్ర ప్రాప్తి లేనట్లు విషాదయోగం లేక భగవత్ సాక్షాత్కారం లేదు. గోపికల విలాపం- విషాదం వారికి మహాయోగమయింది.
శుకయోగి రాజయోగి పరీక్షిత్తుతో నరపతీ! పరమాత్ముని పరుషమైన పలుకులు విని, విరహాగ్ని నుండి వెడలిన వేడి నిట్టూర్పులు సోకగా ఆ గోపికల పెదవులు వట్టి ఎండి పోయాయి. వారి వదనారవిందాల అందమంతా కందిపోయింది. నిరాశ చెందారు. అడలడి (అలజడి) వల్ల మాటలు తడబడగా భయపడి వల్లవ గొల్ల పడతులందరూ పాదాలతో నేల వ్రాస్తూ ఇలా అన్నారు…
మ॥ ‘అకటా నమ్మితి మేము, క్రూరుడన నిన్నర్హంబె? మా యిండ్లలో
సకల వ్యాప్తులడించి నీ పద సరోజాతంబు లర్చింప జి
క్కక యేతెంచితి, మీశుడాఢ్యుడవు మోక్షాసక్తులం గాచు పో
లిక గావందగు గావవే? విడువ మేలే కాంతలన్ భ్రాంతలన్’
అయ్యో! కన్నయ్యా! మేము నిన్నే నమ్ముకున్నాం. క్రూరుడవని నిన్ననడం యోగ్యం కాదు చెల్లదు. మా ఇళ్లలోని అన్ని విషయాలను వ్యవహారాలను, వ్యాపకాలను (ఇంద్రియ వ్యాపారాలను) దిగవిడిచి వదలి, మా మగవారు వారించినా వెరవక నీ పదరాజీవాలు పద్మాలు సేవించడానికి తప్పించుకొని వచ్చాము. నీవు సర్వేశ్వరుడవు, సర్వసంపన్నుడవు. ముముక్షువులను మోక్ష కాంక్షగలవారిని రక్షించు విధంగా ఓ అధోక్షజా! కావదగిన మమ్ము కాపాడు. వేదురు (వలపు) గొన్న వెలదులను మమ్ములను విడిచిపెట్టడం, వెనుదిరిగి పొమ్మనడం నీకు విధాయకం న్యాయం కాదు. పతులను, పుత్రులను, బంధువులను అనుసరించడమే సతులకు పరమధర్మమని ఉపదేశించావు. ‘ధర్మో ధర్మ విదుత్తమః’ నీవు ధర్మ స్వరూపుడవు.
ధర్మవేత్తలలో ఉత్తముడవు కూడా. నీవే ఆలోచించు అన్ని ధర్మాలకు, ఉపదేశాలకు అంతిమ గతి, లక్ష్యం నువ్వే కాదా? ‘నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!’ పతి పుత్రాది అన్ని రూపాలలో అప్రతిహతంగా ప్రకాశించే నిన్నే, ఆ పతి, పుత్రాదికంగా ఎన్ని భావించి, సేవించడం అన్యాయమంటావా స్వామీ? సమస్త దేహధారులకు ప్రాణులకు నీవే ప్రియతమ బంధువు ఆత్మవు కదా! నీవు లేక పతులున్నారా?
పుత్రులున్నారా? అత్తమామలున్నారా? బంధు భ్రాతలున్నారా? ‘జారు జేర జనదు చారు ముఖికి’ ‘వర (శ్రేష్ఠ) కాంత ఎట్టి స్థితిలోనూ పరపురుషుని చేరరాదు’ అని ఆనతి ఇచ్చావే! స్వ పర భేదం లేని సర్వ స్వరూపుడవైన ఓ పరమపురుషా! నీవు పర పురుషుడవా? సర్వ భూతములలో చైతన్య జ్యోతివై ‘నేను’ అను ప్రజ్ఞగా భాసించు వెలుగు నీవు లేకపోతే మా మేనులు దేహాలు మనగలవా? అపరంజి బంగారు లేని ఆభరణాలు ఉంటాయా అచ్యుతా? నీకై తల్లడిల్లుతున్న మమ్ములను ఒల్ల ఇష్టపడనని పలకడానికి నీ ఉల్లం (హృదయం) ఎందుకని జంకడం లేదు పంకజాక్షా?
సీ॥ ‘నీ పాద కమలంబు నెమ్మి డగ్గఱ గాని తరలిపోవంగ బాదములు రావు
నీ కరాబ్జంబులు నెఱి నంటితివ గాని తక్కిన పనికి హస్తములు చొరవు
నీ వాగమృత ధార నిండ గ్రోలగగాని చెవులన్య భాషల జేరి వినవు
నీ సుందరాకృతి నియతి జూడగ గాని చూడవన్యంబుల జూడ్కి కవలు
నిన్ను కాని పలుక నేరవు మా జిహ్వలొల్ల ననుచు బలుక నోడనీవు
మా మనంబులెల్ల మఱపించి దొంగిలితేమి సేయువార మింక గృష్ణ!’...
కృష్ణా! నీ పాద పద్మాలను ప్రీతితో చేరడానికే కాని మరలిపోవడానికి మాకు కాళ్లు రావు. నీ కర కమలాలను పట్టుకోవడానికే తప్ప వేరు పనులకు మా చేతులు పూనుకోవు. నీ వచన సుధారసం తనివి తీర గ్రోలుటకే కాని, ఇతరమైన వ్యర్థపు మాటలు వినడానికి మా చెవులు సుతరాం ఒప్పుకోవు. నీ దివ్య మంగళ సుందర రూపాన్ని కరువుతీర చూచి ఆనందించుటే తప్ప మా కన్నులు ఇతరములను కనుటకు ఇష్టపడవు. నీ నామ రూప గుణ ధామ లీలా విభూతి కాంతులనే కాని మరి దేనినీ మా నాలుకలు పలుకనేరవు.
‘మనోహి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే’… ఇంద్రియాలు ఆయా విషయాలలో క్రియలలో పూనుకొనడానికి మనస్సే కారణం. గృహాసక్తమైన మా మనసునే కదా హరీ! నువ్వు అపహరించింది? ఇక మా ఇళ్లకి ఎలా వెళ్లగలం? వెళ్లి ఏమి చెయ్యగలం? సర్వజీవులకు స్వధర్మం పరమధర్మం పరమాత్మ ప్రాప్తి. ఇతరమైన దేహ ధర్మాలు, గేహ ధర్మాలు, స్నేహ ధర్మాలు అన్నీ లౌకిక పర ధర్మాలు. ‘గతిర్భర్తా ప్రభుః సాక్షీ’ (గీత) జగత్పతీ! నిజమైన భర్త లభించగా ఛాయలైన నీడలైన భర్తల సేవ చెయ్యమంటావా?
‘ప్రేమ విద్యలో గోపలేమ (భామ)లను మించిన వారు లేరు. వారిది మధుర ప్రేమ. భగవంతుని కృష్ణుని ఐశ్వర్య శక్తి కన్నా మాధుర్య శక్తి మిన్న అధిక మహిమ కలది. లౌకిక దావాగ్ని, బడబాగ్ని కన్నా, వైదిక (యజ్ఞీయ) అగ్ని కన్నా, మహాయోగుల యోగాగ్ని కన్నా గోపికల ప్రేమమయ అగ్ని విరహాగ్ని బహుగొప్పది’ అని మూల్పూరు శాస్ర్తుల వారి వ్యాఖ్యానం. గోపికలు అన్నారు.. మా వియోగాగ్నికే మా దేహాలను ఆహుతి చేస్తాము. ‘మనోజాగ్నిచే బొగులం జాలము, కౌగిలింపుము మముం బుణ్యంబు పుణ్యాత్మకా!’ ఓ పుణ్యపురుషా! పాపనాశనా! ఈ భావజు (మన్మథుని) తాపం ఓపలేకున్నాము. మాకు నీ పరిష్వంగ ఆలింగన సౌభాగ్యాన్ని ప్రసాదించి పుణ్యం కట్టుకో. ప్రాణేశ్వరా! నీ పాదాల మీద ఒట్టు. నీ అధర సుధా రసధారలు కురిపించి మా మన్మథాగ్నిని చల్లార్పవేని, నీ విరహాగ్ని జ్వాలలలో భస్మమై పోయి నిన్నే స్మరిస్తూ నీ పాదద్వయాన్నే పొందుతాము.
గోపికలు ఆలింగనం ఆశించినా, అధరామృతం అపేక్షించినా, అంగసంగం అభిలషించినా అంతా అద్వైతమే! రాసలీలలో త్రిపుటి (రస్య, రసిక, రసాలు) కృష్ణమయం. రస్యం ఆస్వాదింపబడేది, రసికుడు ఆస్వాదించేవాడు ‘రసోవై సః’ రసస్వరూపుడైన పరమాత్మే!
క॥ ‘తరుమృగ ఖగ గోగణములు
కరమొప్పెడు నిన్ను గన్న గానము విన్నం
గరగి పులకించు నబలలు
గరగరె నిను గన్న నీదు గానము విన్నన్’..
గోపికలు భువనసుందరా! నీ భవ్య రూపాన్ని చూచినా, నీ మధుర గానం విన్నా, మ్రానులు చెట్లు, మృగాలు, ఖగాలు పక్షులు, నగాలు కొండలు, గో సమూహాలు కరగి పులకించి పోతాయి. మరి, ఓ మురవైరీ! ఈ తరుణీ మణులు నిను కని, నీ గీతం వినీ కిలికించితాల (శృంగార చేష్టా విశేషాలు)తో అంచితం(ఒప్పిదం)గా ద్రవించిపోరా? పురుష భూషణా! ఈ పరుష వచనాలు చాలించి మా మొర ఆలించు దొరా! నీ పాద దాస్య మిచ్చి మమ్ము పాలించు. కంసారీ! సంసారంతో పొత్తు కుదరక పోతే కత్తిరించి పారేయడమే తక్షణ కర్తవ్యం. మహాత్మా! మాకెవ్వరి పొత్తూ వద్దు. నీవు కరుణించి హత్తుకొనకుంటే మేమెలా మనగలం? దర్పకుడు- మన్మథుడు దయమాలినవాడు. మమ్ములను బతకనిస్తాడా?
ఆ॥ ‘అమరుల గాచిన హరి క్రియ
గమలేక్షణ! నీవు నేడు కరుణ నభయ హ
స్తము మా యురముల శిరముల
బ్రమదంబున నిడుము మూర్ఛ పాల్పడకుండన్’..
కమలాక్షా! కమలాపతి శ్రీహరి అమరు (దేవత)లను కరుణించి కాపాడునట్లు, మేము మూర్ఛపాలు గాకుండా ఇప్పుడే దయతో నీ అభయహస్తాన్ని తపించే మా వక్షఃస్థలంపైనా, తలలపైనా ప్రేమతో ఉంచి రక్షించు. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006