మనసు స్థిరమైతే.. విజయమూ సహజమే
మౌని అంటే మౌనంగా ఉండేవాడు కాడు. నిరంతరం మననం చేసుకునేవాడు. నిరంతర మననం వల్ల జ్ఞానం ఉన్నతత్త్వాన్ని పొందుతుంది. చింతన చేయడం వల్ల జరిగిన దానిలో తప్పొప్పులు తెలుసుకొని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ‘అనికేతః’ అన్నాడు. గృహస్థాశ్రమాన్ని వదిలి సర్వసంగ పరిత్యాగియైన వారికి సొంతంగా ఇల్లు ఉండదు.
తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః!
(భగవద్గీత – 12-19)
భగవద్గీత పన్నెండో అధ్యాయంలో 18, 19 శ్లోకాలలో భగవంతుడు తనకెవరు ఇష్టులో చెబుతున్నాడు. శత్రుమిత్ర సమభావన కలిగి ఉండడం, మానావమానాలను, శీతోష్ణ సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవడం, దేనిపైనా మమతాసక్తులు లేకపోవడం, నిందాస్తుతులకు చలింపక పోవడం, మనన శీలత, లభించిన దానితో సంతృప్తి చెందడం, స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం, సర్వసమర్పణ భావన కలిగి ఉండటం (భక్తి)… ఈ లక్షణాలు కలిగిన వాడు నాకు ఇష్టుడు అంటున్నాడు కృష్ణపరమాత్మ.
మౌని అంటే మౌనంగా ఉండేవాడు కాడు. నిరంతరం మననం చేసుకునేవాడు. నిరంతర మననం వల్ల జ్ఞానం ఉన్నతత్త్వాన్ని పొందుతుంది. చింతన చేయడం వల్ల జరిగిన దానిలో తప్పొప్పులు తెలుసుకొని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ‘అనికేతః’ అన్నాడు. గృహస్థాశ్రమాన్ని వదిలి సర్వసంగ పరిత్యాగియైన వారికి సొంతంగా ఇల్లు ఉండదు. శరీరం కూడా ఇల్లులాంటిదే. దానిపై మోహం, భ్రాంతి వల్ల మమకారాదులు ఏర్పడుతాయి. సన్యాసిగా మారిన వారికి భౌతిక ఆస్తిపాస్తులపై ఎలాగైతే మమకారాదులు ఉండవో అలాగే శారీరక వ్యామోహమూ ఉండదు. అలాంటివారిని ‘అనికేతః’ అన్నారు. సాధనకు సహకరించేది స్థిరబుద్ధి. బుద్ధి మంచి చెడులను సూచిస్తుంది.. స్థిరత్వం వల్ల చాంచలత్వం దూరమవుతుంది. అందుకే స్థిరబుద్ధితో ఆరంభించిన ఏ కార్యమైనా సాకారమవుతుంది. బాహ్యంగా పెద్దపెద్ద త్యాగాలు చేయడం కన్నా, మనసులోని సమత్వం, స్థిరత్వమే భక్తికి నిజమైన ప్రమాణంగా భగవంతుడు చెబుతున్నాడు.
కార్పొరేట్ సంస్కృతి కోణంలో దీనిని చూస్తే ఇది భావోద్వేగ నియంత్రణ, వృత్తిపరమైన పరిపక్వతకు ప్రతీకగా కనిపిస్తుంది. ఏ పనిచేసినా పొగిడేవారు, నిందించేవారు ఉంటారు. వారి నిందాస్తుతులను పట్టించుకుంటే ముందుకు సాగలేం. వాటిని స్పందనలుగా భావించి.. నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. దీనిని భావోద్వేగపరంగా నిలకడ గలిగిన యాజమాన్యంగా భావించవచ్చు. మౌనం.. అనేది అనుక్రియకు సంబంధించినది. భావోద్వేగాలు ప్రతిక్రియను కోరుకుంటాయి. అవసరానుగుణంగా స్పందించడం వల్ల సంఘర్షణలను నివారించుకునే అవకాశం ఉంటుంది. నిజానికి అనవసరమైన మాటలు పలకని స్వయం నియంత్రణ అనేది తప్పక సంతరించుకోవలసిన ఉత్తమోత్తమ నైపుణ్యం. నిజానికి సంతృప్తిపడితే ముందుకు సాగలేం కాని ఫలితాన్ని సాధించాలనే తొందరపాటుతో ప్రక్రియను దూరం పెట్టకూడదనేది దాని భావం.
‘అనికేతః’ అనడంలో.. సౌకర్యవంతమైన వలయం నుంచి బయటికి రమ్మనే భావన ఉన్నది. ఇలాంటి ఆలోచనా సరళి కలిగిన వారు మార్పును ఆహ్వానించగలరు. స్థిరమైన బుద్ధితో హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోగలరు. అలాగే సర్వసమర్పణా భావనతో విలువలతో కూడిన నిర్వహణా సామర్థ్యాన్ని ప్రదర్శించగలరు. అలాంటి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. పెద్ద సంస్థకు కీలకమైన ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ జయాపజయాలు కంపెనీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దాని నిర్వహణకు ఎన్నుకున్న వ్యక్తి సమర్థుడు. స్థిరమైన బుద్ధి కలిగినవాడు. ప్రాజెక్ట్ మొదట్లోనే సమస్యలెన్నో ఎదురయ్యాయి. వినియోగదారులు నిరంతరం మార్పులు కోరారు. బృంద సభ్యులు కొందరు ఇది అసాధ్యం అన్నారు. కొందరు నిర్వాహకుడి పని తీరును విమర్శించారు. ఆపై యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరిగింది. ఒకసారి సమీక్షా సమావేశంలో, అత్యున్నత నిర్వాహకుడు అతని పనితీరును తీవ్రంగా తప్పుబట్టాడు. దానికతని బృంద సభ్యులూ వత్తాసు పలికారు. అందరూ అతని నుంచి ప్రతిక్రియను ఆశించారు… అయినా అతను సమావేశంలో నోట్స్ తీసుకున్నాడే కాని ఏమీ మాట్లాడలేదు.
చివరగా చాలా ప్రశాంతంగా అందరినీ ఉద్దేశించి… ‘మీరు చెప్పిన ప్రతి పాయింట్‌ను నేను రెండుగా విడగొట్టాను. ఒకటి నిజమైన సమస్య, రెండోది భావోద్వేగ సంబంధితం. నేను నిజమైన సమస్యలకు సాంకేతికంగా జవాబిస్తాను’, అంటూ వివిధాంశాలను ప్రసంగించాడు. అలాగని తానెవరి మాటనూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. తన మాటలలో ఎవరినీ విమర్శించలేదు. సమావేశం తదుపరి ‘ఇన్ని మాటలు విన్నాక కూడా ఎలా ప్రశాంతంగా ఉన్నావు?’ అంటూ ప్రశ్నించిన ఒక మిత్రునికి సమాధానంగా.. ‘ప్రాజెక్ట్ నన్ను పరీక్షించడం లేదు. నేను నా మనసును పరీక్షించుకుంటున్నాను’ అన్నాడు.
ఈ కథ నేపథ్యంలో భగవద్గీత శ్లోకాన్ని విశ్లేషణ చేసుకుంటే.. అతను ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను భావోద్వేగ పరంగా కాక విశ్లేషణాత్మకంగా తీసుకున్నాడు (తుల్య నిందా-స్తుతి). అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాడు (మౌనీ). పరిమిత వనరులలోనే ప్రాధాన్యాలు మార్చుకున్నాడు (సంతృప్తి). మారుతున్న వినియోగదారుల అవసరాలకు అతుక్కుపోలేదు (అనికేతః) ప్రతి నిర్ణయం స్థిరంగా, సమాచారం ఆధారంగా తీసుకున్నాడు (స్థిరమతి). చివరిగా చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేశాడు. ఇందులో అతని విజయానికి కారణం అతని సాంకేతిక పరిజ్ఞానం కాదు అతని మానసిక స్థితి మాత్రమే.
…? పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

