మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే ైస్థెర్యం, సవాలును దాటి ముందుకు వెళ్లే ధైర్యం ఉండాలి. దానికి దైవం మీద నమ్మకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరూ తన పక్కన లేకపోయినా… తనలో ఉన్న ఆ భక్తే ఎంతటి కష్టాన్నయినా ఢీకొనే విశ్వాసాన్ని అందిస్తుంది. మరి దైవం అంటే నిబంధనలతో, నిబద్ధతతో కూడుకున్నది కదా! ఆయనను తలచుకోవాలంటే మనసు కూడా ఆలయం అంత స్వచ్ఛంగా ఉండాలి. మర్కట మనసున్న మానవులకు అదెలా సాధ్యం! అందుకే అనాదిగా తనకు శ్రద్ధే ముఖ్యం అని భగవంతుడి వాక్కు చెప్తూనే వస్తుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటూ కృష్ణ పరమాత్మ స్పష్టం చేశాడు. ‘నువ్వు తప్పుకోమంటున్నది నన్నా… నాలో ఉన్న ఆత్మనా’ అంటూ చండాలుని రూపంలో ఉన్న శివుడు ఆదిశంకరుడిని ప్రశ్నించాడు. అయినా మనిషిలో సంశయం తీరలేదనుకున్నాడేమో… దత్తాత్రేయుడి రూపంలో తానే గురువై, మానవాళికి మరింత సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నాడు.
తనను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులుగా మార్చి స్తన్యమిచ్చింది అనసూయ. ఆమె చెంత ఉన్న పతులను విడిపించడానికి వచ్చిన పార్వతి, లక్ష్మి, సరస్వతులకు… త్రిమూర్తులు తన ఇంట జన్మిస్తారని మాట ఇస్తే, వారిని తిరిగి పంపుతానని షరతు విధించింది. అలా అనసూయ గర్భాన, అత్రి మహాముని ఇంట జన్మించినవాడే దత్తాత్రేయుడు. సకల శాస్ర్తాలూ కరతలామలకమే అయినా, ప్రకృతిలో ఉన్న 24 అంశాలను తన గురువులుగా పేర్కొన్నాడు దత్తుడు. పంచ భూతాలతోపాటు సూర్యచంద్రులు, పావురాలు, కొండచిలువ మొదలు శిశువు నుంచి కూడా జీవిత సత్యాలను గ్రహించానని చెప్పాడు. విశ్లేషించే విచక్షణ ఉండాలే గానీ ప్రకృతే పరమ గురువు అని తేల్చాడు. ఇవే కాకుండా దత్తాత్రేయుడు నేరుగా బోధించిన ‘అవధూత గీత’, పరశురాముడితో ఆయన సంభాషించిన ‘త్రిపుర రహస్యం’ కూడా అరుదైన ఆధ్యాత్మిక లోతులను పరిచయం చేసేవే. అందుకే అవధూత గీతను వివేకానందుడు, త్రిపుర రహస్యాన్ని రమణ మహర్షి ఇష్టపడేవారు.
దత్తాత్రేయుడి వైభవం ఒక చోటుకు పరిమితం కాలేదు. నేపాల్ నుంచి రామేశ్వరం వరకూ ఎన్నో ప్రాంతాలు ఆయన చరిత్రతో ముడిపడి ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రతీకగా ఆయన మూడు శిరస్సులనూ భావిస్తారు. వాటిని సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగానూ ఎంచుతారు. ఆయన చేతిలో ఉన్న భిక్షాపాత్ర, రుద్రాక్షమాల, త్రిశూలం, చక్రం… అటు జ్ఞానమార్గాన్నీ, ఇటు కర్మయోగాన్నీ సమన్వయం చేసుకుంటూ సాగాలని సూచిస్తాయి. యోగపరంగా అవి యమనియమాదులకు సూచనలు. దత్తాత్రేయుడు కేవలం తన అవతారంతో సరిపుచ్చుకోలేదు. మానవులకు మరింత చేరువయ్యేందుకు… తన బోధలకు ప్రతీకగా జీవించి చూపించేందుకు శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, స్వామి సమర్థ, షిరిడీ సాయి… వంటి రూపాల్లోనూ సంచరించాడు. దత్తాత్రేయుని తొలి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులతో ముడిపడిన పిఠాపురం మన తెలుగునాటే ఉండగా, మరో దత్త క్షేత్రం కురువపురం తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం విశేషం.
దత్త జయంతి అయిన మార్గశిర పౌర్ణమి నాడు కేవలం పుణ్యక్షేత్రాలే కాదు, ప్రతి భక్తుని ఇల్లూ ఓ దత్త క్షేత్రంగా మారుతుంది. ఏదో ఒక రూపంలో ఆయనను ఆరాధించి, ఆయన బోధలు తలచుకుంటారు. వినయంతో కూడిన జ్ఞానాన్ని, విచక్షణతో సాగే కర్మమార్గాన్నీ అందిపుచ్చుకొని విజయం దిశగా అడుగులు వేస్తారు. అందుకే దత్తాత్రేయుడు ఆది గురువు మాత్రమే కాదు, మంచి చెడులను బోధించే ప్రాణమిత్రుడు. చేయి పట్టుకొని నడిపించే మార్గదర్శి! ఆయన ఆశీస్సులను అందుకునే శుభతరుణం ఇది!!!
–కె.ఎల్.సూర్య