నిండు చంద్రుడు మెండుగా వెలిగే పౌర్ణమి అంటే అందరికీ ఆహ్లాదమే! నెలరాజు.. కార్తిక మాసంలో మరింత సుందరంగా ప్రకాశిస్తాడు. నింగిలో మెరిసే పున్నమి చంద్రుడికి దీటుగా ఇలపై కోటి దీపోత్సవం జరుగుతుంది. పరమేశ్వరుణ్ని జ్యోతి స్వరూపంగా ఆరాధించి.. ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు భక్తులు. ఇటువంటి సర్వోన్నతమైన పండుగ రోజు పార్వతీపతిని ఆరాధించేందుకు అత్యంత యోగ్యమైనదని శాస్ర్తాలు చెబుతున్నాయి.
కార్తిక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిటా కల్లోలం సృష్టించారు త్రిపురాసురులు.
వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్లమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తేనే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
కార్తిక దీపదానం
‘కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలేస్థలే యే నివసంతి జీవాః
దృష్టా ప్రదీపం నీచజన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః’
ఈ శ్లోకం చదువుతూ కార్తిక పౌర్ణమి నాడు దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతున్నది. ఈ రోజు వెలిగించిన దీపపు కాంతిని చూసిన సమస్త జీవులకు శుభం జరగాలని కోరుకోవడమే ఈ శ్లోకం అర్థం. దక్షిణాయనంలో వచ్చే కార్తిక మాసం ఉపాసనకు చాలా యోగ్యమైంది. దీపారాధన చేస్తూ ‘దామోదరం ఆవాహయామి’ అని గానీ, ‘త్రయంబకం ఆవాహయామి’ అని గానీ చెబుతూ తమ ఇష్టదైవాలైన శివకేశవులను ఆవాహన చేస్తారు.
‘ఏకస్సర్వదానాని దీపదానం తథైకత’ అని శాస్త్ర వచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని. దీపదానం చేసేవారు స్వయంగా వత్తులను తయారుచేసుకోవాలని పెద్దలు సూచించారు. వరిపిండి, గోధుమపిండితో ప్రమిదను తయారు చేసి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పూజించి, నమస్కరించి, శైవ, వైష్ణవాలయాల్లో దానం చేయాలి. ఇలా దీపదానం చేసిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం.
కార్తిక పౌర్ణమి నాడు సాలగ్రామం, ఉసిరికాయలు దానం చేసినా కూడా పాపాలు నశిస్తాయని నమ్మకం. అంతేకాదు ఇదే రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. దీనిని ఆలయంలో గానీ, ఇంట్లోని పూజగదిలో, తులసి కోట ఎదుట వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజ స్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలూ కలుగుతాయి. కార్తిక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు కనీసం పౌర్ణమి నాడైనా దీపం వెలిగించాలని పెద్దల మాట. ఈ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారికి కూడా.. దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసినవారికి సైతం పుణ్యం దక్కుతుందట.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకూ సంకేతంగా నిలుస్తాయి. దీపారాధన వల్ల శివుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. దీపాలను వెలిగించేవాళ్లకు సహాయకులుగా ఉన్నా, కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజు కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తిక పురాణం చెబుతున్నది.
కార్తిక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించిన వారికి గ్రహ, సర్ప, కాలసర్ప, కళత్ర దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అంతేకాదు, దీపారాధనకు దూది వత్తులు వెలిగిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అరటి, తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగిపోవడంతోపాటు పాపాలు నశిస్తాయి. తెలుపు గన్నేరు వత్తులను ఉపయోగిస్తే సిరిసంపదలు సమకూరుతాయి.
కార్తిక పౌర్ణమి నాడు దాదాపుగా అందరూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి, ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపారాధన ఉసిరి చెట్టు కింద చేస్తే విశేష ఫలం లభిస్తుంది. నైమిశారణ్యంలో కార్తిక పౌర్ణమి నాడు సూత మహర్షి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తిక పురాణంలో వర్ణించారు. ఉసిరిచెట్టు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్ఠం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించాలి. ఆ తర్వాత వండిన పదార్థాలను దైవానికి నివేదించి సహపంక్తి భోజనాలు చేయడం సంప్రదాయం.
కార్తిక మాసంలో తమిళనాడులోని అరుణాచలంలో కొన్ని టన్నుల ఆవునేతిలో, లేదంటే నువ్వులనూనెలో కొన్ని వందల బేళ్ళ పత్తిని, నూలు వస్త్రాలను తడిపి అరుణగిరిపై వెలిగించే దీపానికే కార్తిక జ్యోతి అని పేరు. ఈ జ్యోతి కొన్ని రోజులపాటు వెలుగుతూ గిరి ప్రదక్షిణ చేసేవారికి దారి చూపుతుంది. ఈ కమనీయ దశ్యం చూడటం కోసమే చాలామంది కార్తిక పౌర్ణమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు.
కార్తిక పౌర్ణమి పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తున్నది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది. ఈ వ్రతంలో 21వ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. వ్రతంలో భాగంగా 21 పేటల పట్టు లేక నూలుదారాన్ని తోరంగా ధరించాలి. 21 మంది బ్రాహ్మణులను పూజించిన తర్వాత కలశం/ ప్రతిమలోకి కేదారేశ్వరస్వామిని ఆవాహనం చేయాలి. పూజలో గోధుమపిండితో చేసిన 21 అరిసెలు, పాలు, పెరుగు, నెయ్యి, పాయసంతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తేనె తప్పనిసరిగా ఉండాలి.
ఈ వ్రతంలో 21వ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విశంతి (21) దోషాలుంటాయి. కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి. మనం సమర్పించే నైవేద్య వస్తువులలో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నామన్నమాట. ఈ వ్రతాన్ని ఏకధాటిగా 21 సంవత్సరాల పాటు నిర్వహించి, 21వ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం (ముగింపు) చెప్పుకోవాలి. 21 సంఖ్యను పాటించడంలో ఉన్న విశేషం ఇది. ఈ నోము నోచుకున్నవారికి ఐశ్వర్యానికీ, అన్నవస్త్రాలకూ లోటు ఉండదు.
– డా॥ కప్పగంతు రామకృష్ణ