తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తుల సంఖ్యతో పాటు ప్రతియేట హుండీ ఆదాయం ( TTD Hundi ) గణనీయంగా పెరుగుతుంది. 2024లో స్వామివారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించు కున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీకి రూ. 1,365 కోట్లు ఆదాయం ( Income ) వచ్చిందని అధికారులు వెల్లడించారు. 6 కోట్లమందికి అన్న ప్రసాదం అందజేశామని, 12.14 కోట్ల లడ్డూ విక్రయాలు జరిపినట్టు పేర్కొన్నారు.
కియోస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం(Annprasadam) ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఐటీ డీజీఎం బి.వెంకటేశ్వర నాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ హెడ్ జి .రామ్ ప్రసాద్, డిప్యూటీ రీజనల్ హెడ్ వి.బ్రహ్మయ్య, అధికారులు , బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.